పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలి

Oct 24 2026 12:22 AM | Updated on Oct 24 2026 12:22 AM

శాఖల మధ్య సమన్వయం అవసరం

రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు

క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

బాసర: వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాతో కలిసి బాసరలోని గోదావరి నది పుష్కర ఘాట్లు, వివిధ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.

రూ.1,000 కోట్లతో పుష్కర పనులు..

ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీల ఆదేశాల మేరకు కందకుర్తి నుంచి భద్రాచలం వరకు పుష్కర పనులను పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. అదనంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.354 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఈ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్ట్‌ సంస్థలు మరింత వేగంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. జగద్గురువుల చేతుల మీదుగా కుంభాభిషేకం నిర్వహించే నాటికి అన్ని పనులు పూర్తి కావాలన్నారు.

వారానికోసారి సమీక్ష.

బాసరలో పుష్కరాల పనులను జిల్లా యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తోందని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. పనుల్లో వేగం పెంచేందుకు వారానికి ఒకరోజు అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నామన్నా రు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముడిసరుకులు, అనుమతులు మంజూరు చేస్తున్నామని, గడువులో గా అన్ని పనులు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు.

మారనున్న బాసర క్షేత్రం

బాసరలో అద్భుతమైన పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహిస్తామన్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేక కాంక్రీట్‌ బెడ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్లు సులభంగా వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వాహనాల నిలుపుదల సౌకర్యం, తాత్కాలిక ఏర్పాట్లు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లైట్‌ అండ్‌ సౌండ్‌ సిస్టమ్‌, విద్యుత్‌ దీపాల అలంకరణకు సంబంధించిన టెండర్లు పూర్తయి పనులు ప్రారంభ దశకు చేరుకున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు..

ఈ పర్యటనలో భాగంగా కమిషనర్‌, కలెక్టర్‌, ఇతర అధికారులు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్‌ పాఠక్‌, ప్రధాన అర్చకులు సంజీవ్‌ పూజారి అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ రాథోడ్‌ రమేశ్‌, భైంసా సబ్‌కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్‌, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్‌ పవన్‌చంద్ర, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మొబైల్‌ యాప్‌తో పర్యవేక్షణ

పుష్కర పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు త్వరలోనే ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌తోపాటు మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచే పనుల పురోగతిని పర్యవేక్షించి, ఎక్కడైనా ఆలస్యం జరిగితే వాట్సాప్‌ సందేశాల ద్వారా కాంట్రాక్టర్లకు సమాచారం అందేలా సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. ఇప్పటికే భద్రాచలంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచామని, బాసరలోనూ త్వరలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యా దేవాలయమైన బాసర క్షేత్రం రూ.354 కోట్లతో అత్యంత వైభవంగా అభివృద్ధి చెందడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement