భైంసాటౌన్: పట్టణంలో ‘డిక్కీ’ దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సాధారణ దొంగతనాలకు భిన్నంగా బ్యాంకులు, లేదా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యక్తులే లక్ష్యంగా చోరీలకు తెగబడుతున్నారు. నగదు డ్రా చేసుకుని వెళ్తున్నవారు మార్గమధ్యంలో ఏదైనా పని కోసం ఆగిన క్షణాల్లోనే చోరులు వారి పని కానిచ్చేస్తున్నారు. బ్యాంకులు, రద్దీ మార్కెట్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాపు కాస్తూ.. అమాయకుల కష్టార్జితాన్ని దోచుకెళ్తున్నారు.
క్షణాల్లో మాయం చేసి..
పట్టణంలో గతంలో జరిగిన కొన్ని ఘటనలు పరిశీలిస్తే దుండగులు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్తూ కాస్త ఆదమరిస్తే చాలు.. చాకచక్యంగా సొమ్ము మాయం చేస్తున్నారు. రెండు నెలల కిందట పట్టణంలోని వివేకానంద చౌరస్తాలోని ఓ బార్ వద్ద ఓ వ్యక్తి బైక్ డిక్కీలో రూ.5లక్షల నగదు పెట్టి వెళ్లాడు. కొద్దిసేపటికి వచ్చేసరికి డిక్కీలోని నగదును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. నెలన్నర క్రితం బస్టాండ్ సమీపంలో ఓ మెడికల్ వద్ద మరోవ్యక్తి రూ.2 లక్షలను బైక్ ముందు కవర్‌లో పెట్టి మందుల కోసం వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి నగదు కనిపించలేదు. తాజాగా, కుభీర్ చౌరస్తా వద్ద ఓ బ్యాంకు నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసుకుని వస్తున్న ఓ వ్యక్తిని అనుసరించిన దుండగులు అతను తన వాహనం నిలిపి తిరిగివచ్చిన క్షణాల్లోనే డిక్కీ నుంచి రూ.లక్ష అపహరించుకుపోయారు. రెండేళ్ల కిందట లోకేశ్వరం మండలం గడ్‌చాందకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుంచి రూ.90 వేలు, తన వద్ద అప్పటికే ఉన్న మరో రూ.50వేలను తన కారులో పెట్టి బస్టాండ్ వద్ద ఎస్‌బీఐ వద్ద ఆగాడు. కారు డోర్ లాక్ వేసి వెళ్లగా, అతన్ని అనుసరించిన దుండగులు ఇది గమనించి కారు అద్దాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు.


