నిర్మల్టౌన్: దసరా, బతుకమ్మ ఉత్సవాలు పురస్కరించుకుని పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తెలిపారు. పండుగలకు వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ వినాయక్సాగర్, మహాలక్ష్మి ఆలయ పరిసరాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక్సాగర్ వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్తోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించే శమీ పూజ, రావణ దహన కార్యక్రమాలను ప్రజలు సౌకర్యవంతంగా వీక్షించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశామని, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను అమర్చినట్లు వివరించారు. దసరా రోజు మహాలక్ష్మి ఆలయానికి వచ్చే భక్తులు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. కాలినడకన, ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు గాంధీ చౌక్, విశ్వనాథ్పేట్ మార్గంలో రావాలని, నాలుగు చక్రాల వాహనాలు, ఆటోల్లో వచ్చేవారు కలెక్టరేట్ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలందరూ దసరా, బతుకమ్మ పండుగలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండం శ్రీనివాస్, శ్రీరామోజీ నరేశ్, లక్కాకుల హరీశ్, ఆలయ కమిటీ చైర్మన్ తాళ్ల రాజు, మాజీ చైర్మన్ కుడుకల గంగాధర్, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.


