నిర్మల్చైన్గేట్: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం ఆరో రోజుకు చేరుకుంది. ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. నిరసనలో ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, జిల్లా కోఆర్డినేటర్ రమణ, జేఏసీ నాయకులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ నాగరాజ్, డాక్టర్ సన్నిత్, డాక్టర్ రమేశ్, వినీత తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.


