నిర్మల్టౌన్: ఎంబీబీఎస్లో సీట్లు సాధించిన విద్యార్థులు సేవాభావం అలవర్చుకుని వైద్యరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ సూచించారు. తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన 30 మంది ముస్లిం విద్యార్థులను ఆదివారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా రాణించి, వారికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దేవుడి తర్వాత ప్రజలు వైద్యులను అంతగా గౌరవిస్తారని, అటువంటి పవిత్రమైన వైద్య వత్తిని ఎంచుకున్న విద్యార్థులు సేవే పరమావధిగా ముందుకు సాగాలన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం పీజీలోనూ సీట్లు సాధించి, పూర్తిస్థాయి నైపుణ్యం కలిగిన వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ తల్లిదండ్రులతోపాటు సొంత ఊరికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎంఏ.మతీన్, కార్యదర్శి వహీద్ఖాన్, ముఫ్తీ ఇలియాస్ ఖాస్మి,మొహమ్మద్ ఇంతియాజ్, అబ్దుల్ సాజిద్, ముజాహిద్ మొహియుద్దీన్ పాల్గొన్నారు.


