ఖానాపూర్: పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపిస్తూ తర్లపాడు గ్రామానికి చెందిన గుండేటి రిషిత తన పట్టుదలతో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించి తల్లిదండ్రుల కలను సాకారం చేసింది. గ్రామానికి చెందిన గుండేటి లక్ష్మీనారాయణ, వాణి దంపతుల కుమార్తె రిషిత. నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కష్టపడి చదివించారు. తండ్రి కొన్నేళ్లుగా గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి బీడీలు చేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. రిషిత ఖానాపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి 10 జీపీఏ సాధించింది. అనంతరం కరీంనగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో బైపీసీ చదివి, ఏడాది పాటు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 88,172 ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర మెరిట్‌లో 1,105 ర్యాంకు సాధించింది. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీటు పొందింది.


