బైబై గణేశా | - | Sakshi
Sakshi News home page

బైబై గణేశా

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

● 24 గంటలకు పైగా సాగిన శోభాయాత్ర..

● రెండో రోజూ కొనసాగిన నిమజ్జనం

ఖానాపూర్‌లో

ముగిసిన నిమజ్జనం

ఖానాపూర్‌: పట్టణంలో వినాయక నిమజ్జనం శనివారం ముగిసింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రధాన వినాయక విగ్రహాలతో శుక్రవారం రాత్రి ప్రారంభించిన శోభాయాత్ర శనివారం ఉదయం గోదావరి తీరానికి చేరుకుంది. ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం నిర్వహించారు. స్థానిక జగన్నాథరావు చౌరస్తాలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్రరాజ్యం సురేశ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక మహేందర్‌, మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ చిన్నం సత్యం, తహసీల్దార్‌ సుజాత, కమిషనర్‌ సుందర్‌సింగ్‌, సీఐ సత్యనారాయణ, ఏఈ రాంసింగ్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

నిర్మల్‌టౌన్‌: ‘బైబై గణేశా.. జైజై గణేశా..’అంటూ.. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన వినాయక నిమజ్జనోత్సవం రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన గణేశ్‌ శోభాయాత్ర 24 గంటలకుపైగా సాగింది. బుధవార్‌పేట్‌లోని ఒకటో నంబర్‌ గణపతి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం జరిగింది. శోభాయాత్రను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రధాన రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నాగరేశ్వరవాడ చౌరస్తా వద్ద గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తదితరులు గణనాథులకు స్వాగతం పలికారు.

24 గంటలు ఎస్పీ పర్యవేక్షణ..

నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేలా ఎస్పీ జానకీషర్మిల 24 గంటలపాటు అందుబాటులో ఉంటూ.. భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శోభాయాత్ర మార్గంలో పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తూ పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆమె ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయడంతో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగింది.

ముస్లిం ఏక్తా ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ..

గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎస్పీ జానకీషర్మిల ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమం చేపట్టడం హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు షేక్‌ ముజాహిద్‌, గౌరవ అధ్యక్షుడు హబీబ్‌ జిలాని, ప్రధాన కార్యదర్శి అల్మాస్‌, ఉపాధ్యక్షుడు సాజిద్‌, ఆఫ్రోజ్‌ ఖాన్‌, మొయిజ్‌, ఆసిమ్‌, ఆస్లాం పఠాన్‌, ఇలియాస్‌ పాల్గొన్నారు.

వైస్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో భక్తులకు

అన్నదానం..

వినాయక్‌ సాగర్‌ వద్ద భక్తుల కోసం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి ఆధ్వర్యంలో శనివారం అన్నదానం ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం, అల్పాహారం అందించడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement