నిర్మల్: విపత్తుల వేళ ‘మేమున్నాం..’ అంటూ అండగా నిలవాలనే సంకల్పం ఉన్నవారికి ఓ వేదిక ‘రెడ్‌క్రాస్ సొసైటీ’. ఇందులో సభ్యత్వం ఎన్నో సామాజిక సేవలు చేసేందుకు ఓ మంచి అవకాశం. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, అగ్నిప్రమాదాలు లాంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సాయం అందించడంలో రెడ్‌క్రాస్ కీలకపాత్ర పోషిస్తోంది. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రథమ చికిత్స శిక్షణ ఇవ్వడం, పేదలకు వైద్య సహాయం అందించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సొసైటీ ఇప్పుడు జిల్లాలోనూ సభ్యత్వ సేకరణ చేపడుతోంది. సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న ప్రతిఒక్కరూ ఈ సేవామార్గంలో భాగస్వాములు కావాలని పిలుస్తోంది.
కలెక్టర్ అధ్యక్షతన..
సమాజంలో 18ఏళ్లు నిండిన యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు.. ఇలా ఎవరైనా రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకుని స్వచ్ఛంద సేవకులుగా ముందుకురావచ్చు. ప్రపంచవ్యాప్తంగా కో ట్లాదిమంది జీవితాల్లో వెలుగునింపిన ఈ సంస్థ ప్రస్తుతం జిల్లాలోనూ సభ్యులను చేర్చుకుంటోంది. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకి కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో గవర్నర్ అధ్యక్షతన ఈ సొసైటీ కార్యకలాపాలు సాగిస్తుంది. రక్తదాన శిబిరాల నిర్వహణ, బ్లడ్‌బ్యాంకుల ఏర్పాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారం, దుస్తులు, మందుల పంపిణీ, పేదలకు వైద్య సహాయం, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) శిక్షణలు, అంబులెన్స్ సేవలు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, సహాయక పరికరాల పంపిణీ, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యు వతలో సేవాభావాన్ని పెంపొందించే జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కార్యక్రమాలనూ చేపడుతోంది.
సభ్యులుగా చేరిన రిటైర్డ్ ఉద్యోగులు
జిల్లాలో ప్రస్తుతం రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత సేకరణ కొనసాగుతోంది. ఈ సొసైటీకి నోడల్ అధికారిగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి విజయలక్ష్మిని కలెక్టర్ భవేశ్‌మిశ్రా నియమించారు. జిల్లాకేంద్రంలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఆధ్వర్యంలో ఇప్పటికే 60మంది సొసైటీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. మిగతా సంఘాలు, యువకులూ ముందుకు వస్తున్నారు.


