పునఃప్రారంభానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పునఃప్రారంభానికి సర్వం సిద్ధం

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

● పాఠశాలల్లో పారిశుద్ధ్య చర్యలు ● పంపిణీకి పాఠ్యపుస్తకాలు సిద్ధం ● ప్రైవేటు హంగులు చూసి మోసపోవద్దు ● ‘సాక్షి’తో డీఈవో దర్శనం భోజన్న

లక్ష్మణచాంద: పాఠశాలల వేసవి సెలవులు మరో ఆరు రోజుల్లో ముగియనున్నాయి. ఈనెల 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకులాలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో దర్శనం భోజన్న తెలిపారు. పునఃప్రారంభం ఏర్పాట్లపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

సాక్షి: జిల్లాలో పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయా?

డీఈవో: జిల్లాలో మొత్తం 830 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈనెల 12 నాటికి పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు పొడిగించారు. దీంతో ఈనెల 15న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

సాక్షి: పాఠశాలల్లో పారిశుధ్యం పనులు మొదలు అయ్యాయా? ఎవరు చేస్తున్నారు?

డీఈవో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కావేంజర్లు ఉన్నారు. వారితో పరిసరాలు, తరగతి గదులు, బెంచీలు, మూత్రశాలలు శుభ్రం చేయించాలని హెచ్‌ఎంలకు సూచించాం. ప్రారంభం నాటికి పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంఈవోల ద్వారా ఆదేశాలు ఇచ్చాం.

సాక్షి: కొన్ని పాఠశాలల్లో భవనాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ పాఠశాలల్లో ఇబ్బందులు అధిగమించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?

డీఈవో: కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అనుమతితో అసంపూర్తి పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతాం. నూతన నిర్మాణాలు పూర్తి చేసేలాగా ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుటాం.

సాక్షి: 2026–27 బడిబాట కార్యక్రమంలో ఎంత మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు?

డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాం. నమోదు ఇంకా కొనసాగుతోంది. ప్రతీ పాఠశాల ఉపాధ్యాయులు వారి పరిధిలోని గ్రామాల్లో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను తెలియజేస్తూ చేర్పించేలాగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంచేలా చూస్తున్నారు.

సాక్షి: విద్యార్థులకు యూనిఫామ్‌ అందిస్తున్నారా?

డీఈవో: విద్యార్థులకు అందించే యూనిఫామ్‌కు సంబందించిన వస్త్రం ఇప్పటి వరకు జిల్లాకు రాలేదు. ఇప్పటికే విద్యార్థుల కొలతలు స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకుని కుట్టడానికి సిద్దంగా ఉన్నారు. వస్త్రం రాగానే కుట్టుపని ప్రారంభించి ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు అందేలా చూస్తాం.

సాక్షి: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా? ఏమైనా సర్దుబాటు చేస్తారా?

డీఈవో: జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ఎక్కువ ఉండి సరిపడా ఉపాధ్యాయులు లేకుంటే తక్కువ విద్యార్థులు ఉఉన్న పాఠశాలల నుంచి సర్దుబాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

సాక్షి: విద్యార్థుల తల్లిందడ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?

డీఈవో:ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం, అంకితభావం, అన్ని అర్హతలు గల ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులు ఉచితంగా ప్రభుత్వం అంద చేస్తుంది. మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పాఠశాలల్లో అని వసతులు కల్పిస్తున్నాం. డిజిటల్‌ తరగతులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట పాఠశాలల హంగురు చూసి మోసపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి.

సాక్షి: విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు వచ్చాయా? ఎప్పుడు పంపిణీ చేస్తారు?

డీఈవో: అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పార్ట్‌–1 పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. వాటిని ఆయా పాఠశాలలకు కూడా పంపిణీ చేశాం. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు అందిస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement