లక్ష్మణచాంద: నూతనంగా ఎన్నికై న సర్పంచులు గత కొన్ని నెలలుగా గౌరవ వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచుల గౌరవ వేతనాలు విడుదల చేసింది. 2025 డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న సర్పంచులు అదే నెల 20వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డిసెంబర్ 10 రోజులు, 2026 జనవరి నుంచి మే నెల వరకు (5 నెలలు) మొత్తం ఆరు నెలల గౌరవ వేతనాలను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది.
జిల్లాకు ఇలా..
జిల్లాలో మొత్తం 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెర్కపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపోవడంతో 399 మంది సర్పంచులు ఉన్నారు. ఇందులో 10 మంది సర్పంచుల గౌరవ వేతనాలకు కొన్ని కారణాలతో అప్రూవల్ కాలేదు. మిగిలిన 389 మంది సర్పంచుల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. 10 మంది సర్పంచుల వేతనాలు కూడా త్వరలోనే అనుమతి పొంది విడుదల అవుతాయని అధికారులు తెలిపారు.
వేతనాల మొత్తాన్ని సర్పంచ్‌ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ట్రేజరీకి పంపినట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వేతనాలు విడుదలైన విషయం తెలిసి జిల్లా సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సర్పంచ్‌లు ఇక ముందు మరింత ఉత్సాహంతో గ్రామాభివృద్ధి పనుల్లో పాల్గొంటారని అంటున్నారు.
389 మంది సర్పంచులకు నెలవారీ విడుదలైన మొత్తాలు..
డిసెంబర్ (10 రోజులు) రూ.8,13,010
జనవరి రూ.25,28,500
ఫిబ్రవరి రూ.25,28,500
మార్చి రూ.25,22,000
ఏప్రిల్ రూ.25,15,500
మే రూ.25,15,500
మొత్తం 1,34,27,838
సర్పంచ్‌ల ఖాతాల్లో జమ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ ప్రథమ పౌరుల డిసెంబర్ నెలలో 10 రోజులతోపాటు, జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలు విడుదల చేసింది. జిల్లాకు రూ.1,34,27,838 విడుదల అయ్యాయి. వేతనాలను సర్పంచుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నాం. – శ్రీనివాస్, డీపీవో


