తుదిదశకు ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

తుదిదశకు ధాన్యం కొనుగోళ్లు

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

● ఇప్పటివరకు 1.64 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరణ

భైంసాటౌన్‌: జిల్లాలో రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఓవైపు అధిక దిగుబడులు, అకాల వర్షాలు, మరోవైపు గోదాముల కొరత వెరసి ధాన్యం సేకరణలో జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈసారి మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ నేపథ్యంలో ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఎట్టకేలకు అధికార యంత్రాంగం ధాన్యం సేకరణలో సఫలీకృతమైంది. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో గోదాములు, రైస్‌మిల్లులకు తరలించారు. జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

దొడ్డు వడ్లే ఎక్కువ..

జిల్లాలో ఈసారి దొడ్డురకం ధాన్యమే ఎక్కువ మొత్తంలో సేకరించారు. రబీ సీజన్‌లో 1,83,980 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. 60 కేంద్రాల్లో 21.298 వేల మెట్రిక్‌ టన్నులు సన్నరకం, 235 కేంద్రాల్లో 1.43 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. మొత్తంగా 1.64 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యం విలువ రూ.394 కోట్లు కాగా, ఇప్పటివరకు 16,508 మంది రైతులకు రూ.187 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. మరో 14,282 మంది రైతులకు రూ.207 కోట్లు చెల్లించాల్సి ఉంది.

లక్ష్యం మేరకు కొనుగోలు..

జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణ దాదాపు పూర్తయింది. 1.83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండగా, మరో 19 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించాల్సి ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం.

– సుధాకర్‌, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌

Advertisement
 
Advertisement
Advertisement