డీఏపీపై దోపిడీ!
భైంసాటౌన్: జిల్లాలో రైతులు ఏటా దోపిడీకి గురవుతూనే ఉన్నారు. సాగు చేసిన నుంచి పంటలు విక్రయించేదాకా మోసాలకు గురవుతూ వస్తున్నారు. ఎరువులు, విత్తనాల దుకాణా దారులు అమాయక రైతులను నిలువునా ముంచుతూనే ఉన్నారు. జిల్లాలో తాజాగా డీఏపీ విక్రయాల్లో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖరీఫ్ నేపథ్యంలో రైతులు డీఏపీ కోసం డీలర్ల వద్దకు వెళ్తుండగా వారు యుద్ధం సాకుతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
రూ.300 అధికంగా వసూలు!
కేంద్ర ప్రభుత్వం 50 కేజీల డీఏపీ బస్తా గరిష్ట రిటైల్ ధరను రూ.1,350గా నిర్ణయించింది. కానీ, జిల్లాలో ని ఎరువుల డీలర్లు రూ.1650కి విక్రయిస్తూ బిల్లు మాత్రం రూ.1,350కే ఇస్తున్నారు. అంతే కాకుండా.. డీఏపీ కోసం వెళ్తే ఇతర ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కూడా కొనాలని షరతులు విధిస్తున్నారు. నిర్మల్, భైంసాలో ఎరువులు, విత్తన డీలర్లు ఎక్కువగా ఉండగా, ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో గతేడాది 10,903 మెట్రిక్ టన్నులు డీఏపీ విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,573 మెట్రిక్ టన్నులు విక్రయించారు. డీఏపీ బస్తాను రూ.300 అధికంగా విక్రయిస్తూ.. జిల్లాలో రూ.2కోట్లకు పైగా రైతులను దోచుకున్నారు.
అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ఎరువుల డీలర్లు డీఏపీని అధిక ధరకు విక్రయిస్తే రైతులు మా దృష్టికి తీసుకురావాలి. అలాంటి డీలర్లపై చర్యలు తీసుకుంటాం. రైతులు ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. – అంజిప్రసాద్, డీఏవో
కొరతతో రైతుల అవస్థలు
ముధోల్: జిల్లాలో కొన్నిచోట్ల రైతులకు సరిపడా డీఏపీ అందుబాటులో లేదు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమై డీఏపీ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. పీఏసీఎస్ కా ర్యాలయాల్లోనూ డీఏపీ లేక ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఎమ్మార్పీ ధర కంటే అ ధికంగా విక్రయిస్తూ రైతులను ముంచుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తో ందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీఏపీ సరిపడా అందుబాటులో ఉంచాలని, అధిక ధరకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


