భైంసాటౌన్: పట్టణంలోని ఏఎంసీకి చెందిన మిర్చి యార్డు స్థలం రెంటికి చెడ్డ రేవడిలా మారింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వెజ్, నాన్‌వెజ్, పండ్లు, పూల మార్కెట్లన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా భైంసాకు రూ.7.20 కోట్లతో సమీకృత మార్కెట్ మంజూరు చేసింది. స్థానిక మిర్చియార్డు ఆవరణలో 33 గుంటల స్థలంలో 2021లో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. దాదాపు 50శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దాదాపు రెండేళ్లకుపైగా పనులు జరగక, భవనం అసంపూర్తిగా మిగిలింది. దీనికితోడు భవనం కోసం కేటాయించిన ఏఎంసీ స్థలం నిష్ప్రయోజనంగా మారగా, మార్కెట్ నిర్మా ణం కోసం ఏఎంసీకి చెందిన దుకాణా సముదాయాన్ని కూడా కూల్చివేశారు. ఇటు మార్కెట్ వినియోగంలోకి రాక, అటు దుకాణాలకు అద్దెల రూపంలో ఆదాయం కోల్పోయిన పరిస్థితి నెలకొంది.
స్థలం పాయె.. అద్దెలు పోయె!
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం మిర్చియార్డులో 33 గుంటల స్థలం కేటాయించారు. ఇందుకోసం ఏఎంసీకి చెందిన దాదాపు పదికిపైగా గదులు కూల్చివేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమి కోన్నత పాఠశాల భవనాన్ని కూడా కూల్చేశారు. ప్ర స్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులు నిలిచి మార్కెట్ అందుబాటులోకి రాకపోగా, ఏ ఎంసీ స్థలం, దుకాణాల కూల్చివేతతో అద్దెల రూ పంలో వచ్చే ఆదాయం కోల్పోవడం గమనార్హం.
వినియోగంలోకి తెస్తేనే..
భైంసా పట్టణంలో ప్రతీ సోమవారం వారసంత ని ర్వహిస్తారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామా ల నుంచి కూరగాయలు విక్రయించేందుకు రైతులు, వ్యాపారులు వస్తుంటారు. పట్టణంలో ప్రధాన రోడ్ల వెంబడి పండ్లు, పూలు, చికెన్, మటన్, ఫిష్ వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం పూర్తయితే అందులోనే వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లతోపాటు పూలు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశముండేది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా నిలిచి రోడ్ల పక్కన కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ విక్రయాలు చేపడుతుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు.


