నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

● త్వరలో పాఠశాలల పునఃప్రారంభం ● మళ్లీ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు ● వానాకాలం సాగుపనులూ షురూ.. ● పంట ఎరువులు, విత్తనాల ఖర్చులు ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ఈ నెలలో తప్పని అప్పులు

బొమ్మను గీస్తే..

విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. పేపర్‌, కాన్వాస్‌పై బొమ్మలు గీయడం, రంగులు అద్దడం, ఆలోచింపజేసే చిత్రకళలో నైపుణ్యం పెంచుకుంటున్నారు.

ఎన్‌ఎంఎంఎస్‌కు

55 మంది ఎంపిక

నిర్మల్‌ రూరల్‌: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌)కు జిల్లా నుంచి 55 మంది విద్యార్థులు ఎంపికై నట్లు డీఈవో భోజన్న తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ ఉన్నత పాఠశాల నుంచి 26 మంది ఎంపిక కాగా, పొనకల్‌, బీరవెల్లి, మామడ, నర్సాపూర్‌(జి) పాఠశాలల నుంచి ముగ్గురు చొప్పున, రాజుర, మంజులాపూర్‌, జిల్లా కేంద్రంలోని సోమవార్‌పేట్‌ బాలికల పాఠశాల, లక్ష్మణచాంద ఉన్నత పాఠశాలల నుండి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారని తెలిపారు. మునియాల్‌, పెంబి, కడెం, లింగాపూర్‌, జాఫర్పూర్‌, కొరటికల్‌, కుభీర్‌, ఎడ్‌బిడ్‌, కుంటాల మోడల్‌స్కూల్‌ నుంచి ఒక్కొకకరు చొప్పున ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లు స్కాలర్‌షిప్‌ వస్తుందని తెలిపారు.

నిర్మల్‌: జూన్‌ రాగానే చాలా కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ గాడి తప్పుతుంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యకు సంబంధించిన ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల నేపథ్యంలో సాగు పనులకు సిద్ధమవుతుండటంతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతీ కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండూ వేలకువేలు ఖర్చుతో కూడుకున్నవే.

రైతులకు రెండింతలు..

వర్షాకాలం ప్రారంభం కావడంతోనే పొలాల్లో పనులు మొదలుపెడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ల అద్దె, కూలీల వేతనాలు వంటి ఖర్చులు ఒకేసారి రావడంతో రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. యాసంగి పంటలను ఇప్పుడిప్పుడే అమ్మేస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని గ్రా మాల్లో ధాన్యం, జొన్నలు మిగిలి ఉన్నాయి. వీటి డ బ్బులు చేతికొచ్చేవరకు ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఇటు సాగుపనులు, అటు పిల్లల చదువులకు అంటే.. తప్పని పరిస్థితుల్లో అప్పు చేయాల్సిందే.

అదనపు ఖర్చులూ...

ఈనెలలో ప్రారంభయ్యే వర్షాకాలం సీజన్‌లో పిల్లల చదువులు, సాగు పనులే కాదు.. ఇళ్ల మరమ్మతులు, పైకప్పుల లీకేజీల నివారణ, రెయిన్‌కోట్లు, గొడుగులు, వర్షాకాలానికి అవసరమైన ఇతర వస్తువుల కొనుగోళ్లు కూడా ఉంటాయి. మరోవైపు కూరగాయలు, పాలు, గ్యాస్‌, విద్యుత్‌ బిల్లులు, రవాణా ఖర్చులు వంటి నిత్యావసర వ్యయాలూ పెరుగుతున్నాయి. ఇవన్నీ కుటుంబ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

కుంటాల మండలానికి చెందిన గంగాధర్‌ జీవనాధారం వ్యవసాయం. పిల్లల చదువుల కోసం నిర్మల్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇటు పిల్లల చదువులను చూసుకుంటూ.. రెండుమూడు రోజులకోసారి ఊరికి వెళ్తూ భూమి సాగు చేయిస్తున్నాడు. యాసంగిలో మక్క, వరి దిగుబడి బాగానే వచ్చింది. మొన్ననే పంటలను విక్రయించాడు. ‘హమ్మయ్యా.. పెద్ద పనైపోయింది..’ అని అనుకుంటుండగానే పిల్లల స్కూల్‌ నుంచి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. పైతరగతుల పుస్తకాలు, యూనిఫామ్స్‌ వచ్చాయని, తీసుకోవాలని, వీలైతే ఇదేనెలలో మొదటి విడత ఫీజులనూ చెల్లించాలని సమాచారం ఇచ్చారు. మరోవైపు ఊళ్లో వానాకాలం సాగుపనులు మొదలుపెట్టారు. పంట అమ్మిన డబ్బులు ఎప్పుడు చేతికొస్తాయో కానీ.. ఇటు పిల్లల చదువులు, అటు సాగు పనులకై తే పైసలు కావాల్సిందే. తప్పని పరిస్థితుల్లో జూన్‌లోనూ అప్పుచేయాల్సిందే. ఇది ఒక్క గంగాధర్‌ పరిస్థితే కాదు.. జిల్లాలో వేలాది రైతులు, మధ్యతరగతి కుటుంబాలది కూడా. పిల్లల భవిష్యత్తు కోసం విద్యపై రాజీ పడలేరు. అటు పంట కోసం సాగు పనులనూ ఆపలేరు. ఈ నెలలో చాలా కుటుంబాలు ఇలాంటి తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

బడి ఖర్చులే అధికం..!

పాఠశాలలు ప్రారంభం కావడంతో అడ్మిషన్‌ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాంలు, షూస్‌, బ్యాగులు ఇలా అన్నీ మళ్లీ కట్టాల్సిందే. వీటికి వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఈ భారం మరింత అధికంగా ఉంటోంది. పుస్తకాలు, నోట్‌బుక్స్‌, బ్యాగులు, యూనిఫామ్‌లకే కనీసం ఒక్కొక్కరికి కనీసం రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా మొదటి టర్మ్‌ ఫీజులనూ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బడిని మార్చి, కొత్త స్కూల్‌కు వెళ్తే మళ్లీ అక్కడ అడ్మిషన్‌ ఫీజు కట్టాలి.

Advertisement
 
Advertisement
Advertisement