పేద, మధ్య తరగతికి భారంగా ప్రైవేటు ఫీజులు పుస్తకాలు, యూనిఫాం, ఐడీ కార్డు, టై, బెల్టుకు అదనం.. పిల్లలను ప్రభుత్వ బడికి పంపేందుకు పల్లెల్లో తీర్మానాలు
లక్ష్మణచాంద: విద్య నేటి రోజుల్లో వ్యాపారంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల బలహీనతే ప్రైవేటు విద్యాసంస్థలకు ఊతమిస్తోంది. తమ పిల్ల లకు ఉత్తమ విద్య అందించాలన్న తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నాయి. కార్పొరేట్ హంగులతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏటా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచి కూడా వేల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు పుస్తకాలు, ఐడీ కార్డులు, టై, బెల్టు, షూ పేరుతో మరింత దోపిడీ జరుగుతోంది. ఈ ఫీజులు సామాన్యులు కట్టలేని పరిస్థితి నెలకొన్నది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువు‘కొన’లేని పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్య..
రాష్ట్ర ప్రభుత్వం పూర్వప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలల్లోనే అందించాలని సంకల్పించింది. గతేడాది కొన్ని పాఠశాలల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈసారి జిల్లాలోని 74 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అందుబాటులోకి తెస్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చిన్నారులకు ఆటలు, పాటలతో కూడిన నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించనున్నారు.
గ్రామాల్లో తీర్మానాలు..
ప్రభుత్వం ప్రారంభించిన ఈ పూర్వప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలల్లో అందే విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందనుంది. మరో వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో తమ పిల్లలను కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని ప్రజలు మూకుమ్మడిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. వీడీసీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో తీర్మానాలు కూడా చేస్తున్నారు. లక్ష్మణచాంద మండలంలోని తిర్పెల్లి, పార్‌పల్లి గ్రామాల్లో తమ గ్రామంలోని చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని వీడీసీల ఆధ్వర్యంలో ఇటీవల ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. బాబాపూర్ గ్రామంలో శనివారం గ్రామస్తులంతా కలిసి తమ పిల్లలను ఇకపై ప్రభుత్వ పాఠశాలలకే పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేశారు. ఈ పరిణామాలు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం.


