మళ్లీ ఏడి‘పింఛన్‌! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ఏడి‘పింఛన్‌!

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ● అర్హులకు తప్పని ఎదురుచూపులు

నిర్మల్‌చైన్‌గేట్‌: నాలుగేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎంతో ఎదురుచూస్తున్న అర్హులకు ఈసారీ తీవ్ర నిరాశే మిగిలింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కొత్త పింఛన్ల జాబితా విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022 ఆగస్టు నెలలో చివరిసారి కొత్త పింఛన్లు మంజూరు చేసింది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు కాలేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నాలుగేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్‌ చేసినా, వాటి పరిష్కారం ఇంకా జరగలేదు. తర్వాత కాలంలో వితంతు పింఛన్‌ కోసం ఇచ్చిన దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌ చేయకుండానే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రకటనతో ఆశలు..

కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు రేకెత్తాయి. జూన్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పినా, ఆవిర్భావ దినోత్సవానికి జాబితా విడుదల కాలేదు. ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మంజూరు చేస్తారా లేదా కొత్త దరఖాస్తులకు అవకాశం ఇస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు.

నిలిచిన ప్రక్రియ..

ప్రభుత్వం కొత్త దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించే వ్యవస్థను కూడా ఇంకా ప్రారంభించలేదు. గతంలో అధికారులు ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తులు కూడా ఈసారి మంజూరు కాలేదు. ఫలితంగా దరఖాస్తుదారులకు మళ్లీ నిరాశే ఎదురైంది. కనీసం ఎప్పటి నుంచి మంజూరు చేస్తారన్న స్పష్టమైన సమాచారం కూడా ఇవ్వకపోవడంతో పింఛన్ల విషయం మళ్లీ అనిశ్చితిలో పడింది.

ఎలాంటి ఆదేశాలు రాలేదు

కొత్త పింఛన్లకు సంబంధించిన ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు. గతంలో కొత్తగా చేసుకున్న వారి దరఖాస్తులు మండల స్థాయిలోనే ఉన్నాయి.

– గంగన్న, డీపీఎం

జిల్లాలో పెన్షన్లు ఇలా

మొత్తం పెన్షన్లు 1,44,773

వృద్ధాప్య 33,890

వితంతు 35,664

దివ్యాంగ 9,822

గీత కార్మికులు 266

పైలేరియా 221

డయాలసిస్‌ 110

ఒంటరి మహిళ 2,093

బీడీ కార్మికులు 61,933

ఎదురుచూపులే..

గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు త్వ ప్రకటనతో కొంత ఆశ కలిగినా, జాప్యంతో మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి. కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడు జరుగుతుందని ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement