జిల్లాలో రబీ సీఎంఆర్‌ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో రబీ సీఎంఆర్‌ ఇలా..

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

కేటాయింపు కోసం మిల్లర్ల పైరవీలు పక్షం రోజులుగా డీసీఎస్‌వో కార్యాలయం చుట్టూ చక్కర్లు బినామీ మిల్లులకూ చేరుతున్న వడ్లు..! గత సీజన్లలో రూ.578.46 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి

భైంసాటౌన్‌: జిల్లాలో రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతోంది. గత సీజన్లకు సంబంధించి సీఎంఆర్‌ ప్రక్రియలో అక్రమాలతో జిల్లా రాష్ట్రంలో నే అపఖ్యాతి మూటగట్టుకుంది. 2023–24, 24– 25 ఖరీఫ్‌, రబీ సీజన్లలో ధాన్యం పొందిన మిల్లర్లు పలువురు రూ.వందల కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడంతో అధికారులు పలు మిల్లులపై కేసులు సైతం నమోదు చేశారు. గతేడాది కొత్తగా రైస్‌మిల్లులు ఏర్పాటు చేసిన కొందరు మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం పొందిన కొద్దిరోజుల్లోనే రూ.కోట్ల విలువైన ధాన్యం అమ్మేసుకుని బిచానా ఎత్తేశారు. అధికారులు తీరిగ్గా కేసులు నమోదు చేసి ‘మమ’ అనిపించుకున్నారు.

ధాన్యం అలాట్‌ కోసం..

ఇలా ఏటా రైస్‌మిల్లర్లు డబ్బు, రాజకీయ ఒత్తిళ్లతో మిల్లింగ్‌ సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించుకోవడం, ఆపై కొందరు ధాన్యం అమ్ముకుని రూ.కోట్లకు పడగలెత్తడం చూస్తున్నదే. ప్రస్తుతం రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నేపథ్యంలో ఈసారి సైతం కొందరు డీఫాల్ట్‌ మిల్లర్లు, బినామీ మిల్లర్లు ధాన్యం పొందేందుకు పైరవీలు షురూ చేశారు. అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు మిల్లర్ల సంఘం నాయకులు, మధ్యవర్తులతో పక్షం రోజులుగా జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

రూ.578.46 కోట్లు ఎగవేత..

రైస్‌మిల్లర్లు కొందరు అక్రమార్జన కోసమే ఈ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గత సీజన్లలో ధాన్యం ఎగవేతను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. 2022–23 నుంచి 2025–26 ఖరీఫ్‌, రబీ సీజన్లలో జిల్లాలో 34 రైస్‌మిల్లుల్లో రూ.578.46 కోట్ల విలువైన 1,47,074.83 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పక్కదారి పట్టించారు. దీంతో సదరు మిల్లులపై అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. 2024–25 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సైతం ఒక్క బియ్యం గింజ అప్పగించని రైస్‌మిల్లులు ఉన్నాయి. డీఫాల్ట్‌ మిల్లులకు ధాన్యం ఇచ్చేది లేదని అధికారులు చెప్పడంతోపాటు గత సీజన్‌లో ధాన్యం కేటాయించకపోవడంతో కొందరు మిల్లర్లు కొత్త ఎత్తుగడ వేశారు. బినామీల పేరిట కొత్తగా మిల్లులు ఏర్పాటు చేసుకుని, ధాన్యం కేటాయింపు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. కొందరికి ఇప్పటికే ధాన్యం కేటాయించినట్లు సమాచారం.

డమ్మీ పీవీలతో..

గత రబీ, ఖరీఫ్‌ సీజన్లకు సంబంధించి ధాన్యం పొందిన పలువురు రైస్‌మిల్లర్లు ధాన్యం విక్రయించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే సకాలంలో బియ్యం అప్పగించకుండా, అధికారులు పీవీ(ఫిజికల్‌ వెరిఫికేషన్‌) కోసం వచ్చిన సందర్భాల్లో ఇతర మిల్లర్ల ధాన్యం అప్పటికప్పుడు తెప్పించుకుని పీవీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా డమ్మీ పీవీలతో తిరిగి ధాన్యం పొందేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా సీఎంఆర్‌ ప్రక్రియలో గత అనుభవాల దృష్ట్యా సీఎంఆర్‌లో అక్రమాలు జరగకుండా, ధాన్యం పక్కదారి పట్టకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. తద్వారా ధాన్యం ఎగవేసే మిల్లర్లకు కల్లెం వేసినట్లవుతుంది.

యాక్టివ్‌ మిల్లులు 31

డీఫాల్ట్‌, డీఫంక్ట్‌ మిల్లులు 84

ధాన్యం సేకరణ

అంచనా

1.83 లక్షల

మెట్రిక్‌ టన్నులు

ఇప్పటివరకు

సేకరించింది

లక్ష మెట్రిక్‌

టన్నులు

యాక్టివ్‌ మిల్లులకే కేటాయింపు..

రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. 1.83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం. జిల్లాలో 113 రైస్‌ మిల్లులు ఉండగా, 84 డీపాల్ట్‌, డీఫంక్ట్‌ మిల్లులున్నాయి. వాటికి మినహా మిగిలిన 31 యాక్టివ్‌ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయిస్తున్నాం. జిల్లాలో 14 గోదాముల్లో ధాన్యం నిల్వ చేయడంతోపాటు పెద్దపల్లి జిల్లాలోని 4 మిల్లులకు ధాన్యం తరలిస్తున్నాం.

– రాజేందర్‌, డీసీఎస్‌వో

Advertisement
 
Advertisement
Advertisement