ఖరారు కాని నూతన ఈహెచ్‌ఎస్ విధి విధానాలు అప్పుడే వేతనంలో కోత మొదలు పెట్టిన ఆర్థిక శాఖ మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
నిర్మల్ రూరల్/నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నూతన ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. జూన్ 2 నుంచి పథకం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు కాలేదు. కానీ ఆర్థిక శాఖ అత్యుత్సాహం ప్రదర్శించింది. పథకం ప్రారంభం కాకముందే.. మే నెల వేతనాల నుంచి 1.5 శాతం ఈహెచ్‌ఎస్ పేరిట కోత పెట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కొనసాగుతున్న నమోదు..
నూతన ఆరోగ్య పథకం కోసం ఉద్యోగి వివరాలు, డిపెండెంట్లు, పిల్లల సమాచారం సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారం రోజులుగా ఉపాధ్యాయులంతా ఫారాలు నింపి ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఉపాధ్యాయులు భావించారు. కానీ ఆశ్చర్యకరంగా, ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వు జారీ కాకముందే, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదరకముందే, ప్యాకేజీ రేట్లు నిర్ణయించలేదు. డిజిటల్ హెల్త్ కార్డులు కూడా ఇంకా జారీ కాలేదు. అయినా మే నెల వేతనంలో కోత విధించడం ఉపాధ్యాయులను కలవరపెడుతోంది.
ఉద్యోగులు, పెన్షనర్ల అసంతృప్తి
ప్రభుత్వం మే 31 వరకు వివరాలు నమోదు చేయాలని గడువు విధించింది. అయితే మే 30 వరకు కూడా వెబ్‌సైట్‌లో మార్పులు జరుగుతూనే ఉన్నా యి. నిబంధనలు రోజుకోరీతిన మారుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అయినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన చికిత్స సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం చెప్పినప్పుడు అన్ని సంఘాలు అంగీకరించాయి. విధానాలు ఖరారు కాకుండానే వేతనాల్లో 1.5% కోత విధించడం సరికాదని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. దీరినూ పీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని, మే నెల వేతనంలో కోత విధించిన సొమ్ము జమ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దుర్మార్గమైన చర్య..
మేనెల జీతం నుంచి 1.5 శాతం కోత విధించడం సరైనచర్యకాదు. భార్యాభర్తలు ఉద్యోగులైన ఇరువురు జీతంలో కూడా కోత విధించారు. ఎటువంటి సమాచారం లేకుండా కోత విధించటం దుర్మార్గమైన చర్య. జూన్ నెల నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని మే నెల జీతంలో కోత విధించటం భావ్యం కాదు. విధివిధానాలు, కార్డులజారీ, ఉద్యోగి అనుమతి వంటివి పూర్తయిన తర్వాత నగదు రహిత చికిత్సమార్గదర్శకాలు విడుదల తర్వాతనే కోత విధించాలి.
– తోట నరేంద్రబాబు,రమణారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీఆర్టీయూటీఎస్
జిల్లాలో ఉద్యోగుల వివరాలు..
ప్రభుత్వశాఖల ఉద్యోగులు 7,400
(అన్ని శాఖల్లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్)
ప్రభుత్వ ఉపాధ్యాయులు 2,500
రిటైర్డ్ ఉద్యోగులు,పెన్షనర్లు 2,800


