కొనసాగుతున్న పింఛన్‌దారుల నమోదు
జిల్లాలో 1.44 లక్షల పైచిలుకు లబ్ధిదారులు
పట్టణాల్లో వార్డు అధికారులు,
పల్లెల్లో కార్యదర్శుల సర్వే
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి కొత్తగా చేయూత పింఛన్ మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హుల ఏరి వేత ప్రక్రియ చేపట్టింది. ఈమేరకు ఐరిష్‌ను నమో దు చేసుకునే కార్యక్రమం చేపట్టింది. అన్ని గ్రామాలతోపాటు పుర కేంద్రాల్లో ఈనెల 16 నుంచి పింఛన్‌దారుల వివరాలను ప్రత్యేక చేయూత యాప్‌లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుడి ఆధార్ నంబర్‌తోపాటు అతని కళ్లు, ముఖం ఫొటో క్యాప్చర్ చేస్తూ నమోదు చేసుకుంటున్నారు. సకాలంలో యాప్ వివరాలు నమోదు చేసుకోకుంటే వారి పింఛన్ రద్దయ్యే అవకాశం ఉంది. కూలీ పనులతోపాటు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వారిని వారి కుటుంబ సభ్యులు పిలిపించుకుని అధికారుల వద్ద వివరాలు నమోదు చేయిస్తున్నారు.
జూన్ 15 వరకు నమోదు..
జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, 400 గ్రామపంచాయతీలలో చేయూత నమోదు కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. జూన్ 15 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించడంతో ప్రతీలబ్ధిదారు తమ వివరాలతోపాటు అధికారులు అడిగిన సమాచారాన్ని అందిస్తున్నారు. జిల్లాలో చేయూత పింఛన్ పొందుతున్న వారి సంఖ్య 1,44,773గా ఉందని డీఆర్డీవో అధికారులు తెలిపారు.
మృతిచెందిన వారి తొలగింపునకే..
చాలా గ్రామాల్లో లబ్ధిదారులు చనిపోయినా.. అతడి పేరుపై కుటుంబ సభ్యులు నేటికీ బ్యాంకు, పోస్టాఫీసు ద్వారా పింఛన్ పొందుతున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత యాప్‌లో లబ్ధిదారుల నమోదుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లే అక్కడే ఐరిష్ నమోదు చేస్తుండటంతో ఇకపై మృతిచెందిన వారి పింఛన్లు నిలిచిపోవడం ఖాయమంటున్నారు. దీంతో అర్హత కలిగి నేటికి పింఛన్ తీసుకోలేని వారికి ఇది ఒక అవకాశంగా మారింది.
అర్హుల నిరీక్షణ..
మరోవైపు చేయూత పెన్షన్ల కోసం అర్హులు నిరీక్షిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, బీడీకార్మిక, ఒంటరి మహిళలు కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే.. భార్యకు, భార్య చనిపోతే.. భర్తకు పెన్షను బదిలీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మార్పు చేయలేదు. ఫలితంగా జిల్లాలో అర్హతలు ఉన్నా చేయూత పెన్షన్ రావడం లేదు. ప్రభుత్వం జూన్ 2వ తేదీ తరువాత కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారి అర్హతలను పరిశీలించి చనిపోయినవారి స్థానాల్లో కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. లైవ్ అథెంటికేషన్ పూర్తయితేనే చేయూతపై క్లారిటీ వస్తుందని అధికారులు పేర్కొన్నారు.


