ఖానాపూర్: పెంబి మండలంలోని ఆదివాసుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరవదిక దీక్ష శుక్రవారం ఐదో రోజు కు చేరుకుందన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ, పెంబి మండలంలోని ఆదివాసులు రోడ్డు సౌకర్యం, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పోడు భూములకు సాగునీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా నిరవదిక నిరసన దీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. రెండు నెలల క్రితం ఆదివాసులు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారని, అప్పట్లో అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కొన్ని గూడేల్లో మాత్రమే మంచినీటి సమస్య పరిష్కరించారని, మిగతా ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూముల్లో జేసీబీలతో బావులు తవ్వుకోవడానికి, బోర్లు వేయించుకోవడానికి అనుమతులు ఇ వ్వాలని కోరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదివా సుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసుల పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐఎం ఏరియా కమిటీ సభ్యులు డాకుర్ తిరుపతి, సుంచుల నారాయణ, ఖానాపూర్ పట్టణ కార్యదర్శి పానగంటి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


