ఉద్యోగాల పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో మోసం

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

● ఒక్కో పోస్టుకు లక్షల్లో డిమాండ్‌.. ● రాజకీయ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు.. ● మాజీ క్యాంపస్‌ అధికారిపై ఆరోపణలు ..

భైంసా/బాసర: బాసరలోని ప్రముఖ విద్యాసంస్థ రాజీవ్‌ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీ యూకేటీ)లో అవుట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించే సెక్యూరిటీ గార్డు పోస్టుల అమ్మకం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఖాళీ అయిన సుమారు 15 పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ద్వారా జరుగుతున్న నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ ఒత్తిళ్లు, లక్షల్లో వసూళ్లు..

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలే అయినా నిరుద్యోగుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న కొందరు దళారులు, మధ్యవర్తులు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ సిఫార్సులతో కొందరు ప్రయత్నాలు చేస్తే, మరికొందరు ఉద్యోగం కోసం లక్షల రూపాయలు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు భారీ మొత్తాల్లో బేరసారాలు జరిగినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. కీలక వ్యక్తుల ఖాతాలు పరిశీలిస్తే వసూళ్ల వ్యవహారం స్పష్టమవుతుందని బాధితులు చెబుతున్నారు. గతంలో క్యాంపస్‌లో పనిచేసిన ఒక అధికారి పై కూడా ఆరోపణలు వస్తున్నాయి.

కార్మికులకు బెదిరింపులు..

సెక్యూరిటీ విభాగంతోపాటు పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేసే సంస్థలపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కొత్త నియామకాల పేరుతో లంచాలు వసూలు చేయడమే కాకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల్లో కోతలు విధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికులు మౌనం వహిస్తున్నారు.

రూ.50 వేలు చెల్లించినా ఉద్యోగం రాలేదు...

ఈ అవినీతి ఇప్పుడు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. బాసరకు చెందిన ముగ్గురు యువకులు ఒక ప్రజా ప్రతినిధిని నమ్మి సెక్యూరిటీ గార్డు పోస్టుల కోసం ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున అడ్వాన్స్‌గా ఇచ్చారు. పనిలో చేరిన తర్వాత మరో రూ.లక్ష ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు బాసర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో అవినీతి బయటపడింది. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. బాధితులు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నారు.

విచారణ జరుపుతున్నాం

సెక్యూరిటీ గార్డుల నియామకానికి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై ఫిర్యాదు వచ్చింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్నాం. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీ సుకుంటాం. బాధితులు ఇచ్చిన పేర్ల ఆధారంగా విచారణ జరుపుతున్నాం.

– దీపక్‌, బాసర సీఐ

Advertisement
 
Advertisement
Advertisement