నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లు రవాణా ప్రక్రియలు వేగవంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ భవేశ్‌మిశ్రా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై శనివారం మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా మొక్కజొన్న, వరి, జొన్నల కొనుగోళ్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
మక్కల కొనుగోళ్లలో రికార్డు...
మే 31 నాటికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకువచ్చారన్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1,700 నుంచి రూ.1,800 మాత్రమే లభిస్తుండగా, ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా రైతులకు అధిక లాభం చేకూరిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్రాలకు వచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేయడంతో మే 30 నాటికే 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1.34 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను గోదాములకు తరలించగా, సుమారు 30 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రాల్లో ఉన్నాయన్నారు. జూన్ 2 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
వరి కొనుగోళ్లు వేగవంతం..
జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతేడాది కూడా ఇదే స్థాయిలో కొనుగోళ్లు జరిగాయని ఇప్పటి వరకు 80 నుంచి 85 వేల మెట్రిక్ టన్నుల వరిని గోదాములకు తరలించామన్నారు. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల వరి రవాణా జరుగుతోందన్నారు. మక్కల రవాణా పూర్తయిన తర్వాత అదనపు లారీలు, హమాలీలను వరి రవాణాకు వినియోగించి రోజువారీ సామర్థ్యాన్ని 9 వేల మెట్రిక్ టన్నులకు పెంచుతామని తెలిపారు.
వర్షాలపై ముందస్తు చర్యలు...
రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకా శం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టామని కలెక్టర వివరించారు. ఇప్పటి వరకు ఒక్క బస్తా ధాన్యం కూడా తడవలేదన్నారు. వర్షాలు కురి సినా ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు.
జొన్నల కొనుగోళ్లకు సన్నద్ధం..
జిల్లాలో జొన్నల కొనుగోళ్లకు 13 కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు భవేశ్‌మిశ్రా తెలిపారు. మక్కల కొనుగోళ్లు పూర్తయిన వెంటనే జొన్నల కొనుగోళ్లు చేయనున్నట్లు చెప్పారు. క్వింటాలుకు రూ.3,700 మద్ద తు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా 35 వేల నుంచి 40 వే ల మెట్రిక్ టన్నుల జొన్నల కొనుగోలు చేస్తామని వె ల్లడించారు. జొన్నల నిల్వ కోసం ఇప్పటికే 20 నుంచి 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదా ములను సిద్ధం చేశామని, జూన్ 10 లేదా 11 నాటికి కొనుగోళ్లు, రవాణా పూర్తవుతాయని తెలిపారు.
గోదాముల సామర్థ్యం పెంపు..
భారీ స్థాయిలో పంట కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో గోదాముల కొరత తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపా రు. ప్రస్తుతం జిల్లాలో 1.90 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను అందుబాటులో ఉంచామన్నారు. లోకేశ్వరం, కడెం మండలాల్లో అదనపు గోదాములను గుర్తించి వినియోగంలోకి తెచ్చామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు.


