భైంసాటౌన్: పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా సిబ్బంది ఎజెండా అంశాలను చదివి వినిపించారు. రూ.35 లక్షలతో అన్నివార్డుల్లో గుంతల పూడ్చివేత, సీసీ డ్రెయిన్లు, కల్వర్టులపై స్లాబుల నిర్మాణం, సీసీ రోడ్లకు మరమ్మతులు, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు కోసం మరో రూ.10 లక్షలు కేటాయిస్తూ ఎజెండాలో పొందుపర్చారు. అనంతరం ఎజెండాపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బక్రీద్ సందర్భంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా చేపట్టారని, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయలేదని ప్రతిపక్ష ఎంఐఎం కౌన్సిలర్లు ఆరోపించారు. 90 రోజుల కార్యాచరణ ప్రణాళికలోనూ తమను భాగస్వాములను చేయలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ క్రమంలో ఎంఐఎం, అధికార కౌన్సిలర్ల మధ్య తోపులాటకు దారి తీసింది. చైర్మన్, మాజీ చైర్మన్ మధ్య వ్యక్తిగత దూషణల పర్వం కొనసాగింది. అలాగే, పట్టణంలోని ఇండస్ట్రీయల్ ప్రాంతంలోని భూములను నివాస ప్రాంతాల్లోకి మార్చేందుకుగాను టేబుల్ ఎజెండా ప్రతిపాదించగా, దీనిపై ప్రతిపక్ష ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాక, అధికార పక్ష కౌన్సిలర్లు ముగ్గురు సమావేశానికి రాకపోవడంతో వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని మాజీ చైర్మన్ జాబీర్ అహ్మద్ పట్టుబట్టారు. అనంతరం సమావేశం నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు. చైర్మన్ దత్తాత్రి మాట్లాడుతూ.. రెండు అంశాలతో కూడిన ఎజెండా కౌన్సిల్ ఆమోదం పొందిందని, కానీ, టేబుల్ ఎజెండాలోని ఇండస్ట్రీయల్ జోన్‌లోని భూములను నివాస ప్రాంతంలోకి మార్చేందుకు చేసిన ప్రతిపాదనను ఎంఐఎం అడ్డుకుందని పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ ఎం.లింగయ్య, టీపీవో అనురాధ, మేనేజర్ గౌరీష్ పాల్గొన్నారు.


