కడెం: పులి ఆవాసం కోసం కవ్వాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తరలించి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ వారికి పరిహారం కింద అందాల్సిన సాగు భూముల పంచాయితీ తెగడం లేదు. మండలంలోని పెత్తర్పు సమీపంలో పునరావాస గిరిజనులకు సాగుభూముల హద్దులు చూపేందుకు శనివారం తహసీల్దార్ ఖాజా మెయినుద్దీన్, ఎఫ్‌ఆర్‌వోలు గీతారాణి, శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. గతంలో లానే మళ్లీ పక్కనే ఉన్న గొండుగూడ వాసులు ఆ భూములు తమవని, హద్దులు పెట్టకుండా అడ్డుకున్నారు. ఇరు గ్రామాల గిరిజనులతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, తహసీల్దార్లు మారినా తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని పునరావాస గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల్లో తమ సమస్యను పరిష్కరించకపోతే పాత గ్రామా లకు వెళ్తామని అధికారులను హెచ్చరించారు. తహసీల్దార్ కలెక్టర్‌కు, అటవీ అధికారులు డీఎఫ్‌వోకు ఇక్కడి పరిస్థితిని వివరించారు. ఇందులో ఆర్‌ఐ శారద, డీఆర్వో ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.


