నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్ర నిపుణుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెల్మల మధుకు రాష్ట్రస్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బాటనీ పాఠ్యపుస్తక రచన కోసం ఏర్పాటు చేసిన విషయ నిపుణుల కమిటీలో ఆయనకు స్థానం లభించింది. ప్రతిష్టాత్మక తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ పుస్తక రచనకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 15మంది విషయ నిపుణులను ఎంపిక చేయగా అందులో డాక్టర్ మధు ఒకరు. మధు ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. వృక్షశాస్త్ర విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన, పలు జాతీయ, అంతర్జాతీయస్థాయి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించి ప్రత్యేక గుర్తింపు పొందారు. బోధనతోపాటు పరిశోధనారంగంలోనూ విశేష కృషి చేస్తూ విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. రాష్ట్రస్థాయి పాఠ్యపుస్తక రచన కమిటీలో జిల్లా వాసికి చోటు దక్కడంపై విద్యావేత్తలు, సహచర అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.


