నిర్మల్‌చైన్‌గేట్: మరో పక్షం రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానుంది. వానాకాలం సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో యాసంగి రైతు భరోసా అందలేదు. రెండెకరాల్లోపు రైతులకే రెండు విడతల్లో ప్రభుత్వ సాయం అందింది. ఇక వానాకాలం సాగుకు ఎప్పుడు ‘భరోసా’ అందుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులున్నారు.
రైతులకు రూ.100 కోట్ల బకాయి?
జిల్లాలో 2.24 లక్షల మంది రైతులు సుమారు 4.30లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎకరాకు రూ.6వేలు చొప్పున వానాకాలం, యాసంగికి కలిపి రూ.12వేలు అందజేస్తోంది. యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధులను డిసెంబర్, జనవరిలో విడుదల చేయాల్సి ఉండగా ఈసారి మార్చిలో మొదటి విడతలో ఎకరంలోపు రైతులకు, ఏప్రిల్‌లో రెండో విడత కింద రెండెకరాల లోపు రైతులకు సాయం అందించింది. రైతు భరోస సాయం కింద జిల్లాలోని 1,91,288 మంది రైతులకు రూ.266 కోట్లు అందించాల్సి ఉండగా ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి రూ.168కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా రూ.100 కోట్లు రావాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో రైతాంగం
గతంలో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. బీఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు పథకం వచ్చాక రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత తగ్గింది. అయితే, ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం చేస్తోంది. దీంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. యాసంగి రైతు భరోసానే పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఇక వచ్చే ఖరీఫ్ పెట్టుబడి సాయం వస్తుందో.. రాదోననే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
యాసంగి రైతు భరోసా ఇలా..
మండలం రైతుల సంఖ్య పొందిన సొమ్ము
భైంసా 15,948 రూ.15,38,42,312
కుభీర్ 18,547 రూ.18,49,64,716
కుంటాల 8,318 రూ.7,86,24,343
దస్తురాబాద్ 5,508 రూ.4,17,75,903
కడెం 11,901 రూ.9,78,16,605
ఖానాపూర్ 9,845 రూ.7,59,80,487
పెంబి 6,070 రూ.5,79,24,306
బాసర 6,836 రూ.6,34,71,004
లోకేశ్వరం 12,970 రూ.11,17,46,169
ముధోల్ 12,720 రూ.11,99,29,925
తానూర్ 15,753 రూ.15,55,31,279
దిలావర్‌పూర్ 7,022 రూ.5,93,19,305
నర్సాపూర్(జి) 7,554 6,49,12,557
సోన్ 7,687 రూ.6,03,56,873
లక్ష్మణచాంద 9,278 రూ.6,93,98,486
మామడ 11,115 రూ.9,55,90,501
నిర్మల్‌రూరల్ 9,325 రూ.6,93,16,738
నిర్మల్‌అర్బన్ 579 రూ.32,27,559


