నిర్మల్‌చైన్‌గేట్: ఇటీవల ఎండల తీవ్రత పెరగడంతో వాతావరణశాఖ జిల్లాకు రెడ్ అలర్డ్ ప్రకటించింది. వారంరోజులుగా జిల్లా వ్యాప్తంగా 41నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడదెబ్బ బారిన పడిన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి అధికారులు ముందస్తుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, భైంసా ఏరియాస్పత్రిలో ప్రత్యేకంగా హీట్ స్ట్రోక్ వార్డులు ఏర్పాటు చేశారు. ఇందులో వైద్యులతోపాటు ఏఎన్‌ఎంలు 24గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా వడదెబ్బ బారిన పడితే వీటిలో అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు.
మరింత జాగ్రత్తగా ఉండాలి
జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిది. అత్యవసరమైతే టోపీ, రుమాలు ధరించి వెళ్లాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా చిన్నారులు, వద్ధులు, దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
– రాజేందర్, డీఎంహెచ్‌వో
వార్డులో అందుబాటులో ఉన్న మందులు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన
హీట్ స్ట్రోక్‌వార్డులో చికిత్స పొందుతున్న రోగులు
అందుబాటులో మందులు
జిల్లా వైద్యారోగ్యశాఖతో పాటు జీజీహెచ్, ఏరియాస్పత్రుల అధికారులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధిహామీ పనులు చేసే ప్రాంతా ల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచా రు. పీహెచ్‌సీల్లో ఓపీ సేవల కోసం వచ్చే వారు డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రత్యేకంగా లీటర్ నీటిలో ఒక ఓఆర్‌ఎస్ ప్యాకెట్ కలిపి దాహం వేసిన వారికి అందిస్తున్నారు. వేసవిలో వచ్చే జబ్బులకు సంబంధించిన మందులు, గ్లూ కోజ్ బాటిళ్లను అన్ని ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా రోజువారీ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.


