నిర్మల్:జిల్లాలో ఓ దిక్కు వర్షాలు పడుతున్నాయి. మరో దిక్కు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. వర్షం పడితే కళ్లముందే తమ కష్టమంతా కొట్టుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం కూడా తరలించడం లేదు. సంచికి అదనంగా 20 రూపాయలు ఇస్తామన్నా లారీలు రావడం లేదు. మిల్లులకు వెళ్లిన లారీ రావాలంటే రోజులు పడుతోంది. రైతన్నలే స్వయంగా వెళ్లి బతిమాలుకుని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు కేంద్రాలవైపు కన్నెత్తి చూడడం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రాలవైపు రాకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సొంత రైతుల కష్టం పట్టదా..!?
జిల్లాలోని మూడు నియోజకవర్గాలకుగాను బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నా రు. మూడు చోట్ల ధాన్యం, మక్కలు, జొన్నలు ఇలా ఏదో ఒక రకమైన పంట కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. లారీలను సైతం రైతులే తెచ్చుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు స్థానికంగా కాకుండా ఇతర జిల్లాల్లో ఆందోళనలు చేయడం, పర్యటనలకు వెళ్లడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై పోరాటం ప్రారంభించింది. ఇదే సమయంలో జిల్లా రైతులు ధాన్యం, మక్కల కొనుగోలుకు ఆందోళనలు చేస్తున్నారు. కానీ సొంత నియోజకవర్గాల్లో కాకుండా పొరుగు జిల్లాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు యాత్ర చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే విహార యాత్రకు వెళ్లి రెండు రోజుల క్రితమే వచ్చారు. జిల్లా నుంచి గెలిచి ఎమ్మెల్సీలు, అత్యధిక ఓట్లతో గెలిచిన ఎంపీ సైతం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డెక్కుతున్న రైతన్న..
ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నా తమ కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడంతోపాటు అకాల వర్షానికి తమ కష్టమంతా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన బాటపడుతున్నారు. ఓవైపు కలెక్టర్‌సహా జిల్లా అధికారులు కొనుగోలు వేగవంతం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ స్పీడ్ లేక రైతులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట సైతం రైతులు ధర్నాకు దిగారు. తాము బంగారం అడగటం లేదని, పండించిన పంటలు సకాలంలో కొనుగోలు చేసి, తరలించాలనివేడుకుంటున్నారు.
చిన్న రైతుల గోస...
దిగుబడి ఎక్కువగా వచ్చిన రైతులు సంచికి అదనంగా రూ. 20 నుంచి రూ.25 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మక్క తరలించడానికి రూ.15 నుంచి రూ.20 వరకు రైతులు ఇస్తున్నారు. కానీ.. భూ విస్తీర్ణం తక్కువగా ఉండి, పంట దిగుబడి తక్కువగా వచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సంచికి అంత మొత్తం ఇస్తే తమకు ఏం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వమే వర్షాలు పడి తమ పంట నష్టం కాకముందే కొనుగోలు చేసి తరలించాలని కోరుతున్నారు.
కడెం చేరుకున్న బీజేపీ నేతలు
కడెం: రైతు గోస.. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం రాత్రి కడెం చేరుకున్నారు. ఎంపీలు నగేశ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రామారావుపటేల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య తదితరులు కడెంలోని బృందావన్ రిసార్ట్స్‌లో విడిది చేశారు. గురువారం పెద్దూర్‌లోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ తెలిపారు.


