న్యూస్‌రీల్
ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. వేడి కాస్త తగ్గుతుంది.
భైంసా: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులు.. అమ్ముకునేందుకు అగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతకు అకాల కష్టం వచ్చింది. వడగండ్ల వానలు వణికిస్తున్నాయి. పంటలను కాపాడుకోవడానికి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. భైంసా డివిజన్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్లాల్లోని మొక్కజొన్న, వరి ధాన్యం కాపాడుకోవడానికి రైతులు పరుగులు తీశారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పంట కుప్పల చుట్టూ నీరు నిలిచి ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఏర్పడింది. కొందరు రైతులు కుటుంబ సభ్యులతో కలిసి టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు చీకట్లో పంటను రక్షించుకోవడానికి అవస్థలు పడ్డారు.
తరలింపుల జాప్యంతో కష్టాలు..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. లారీల కొరత, గోదాముల్లో హమాలీల సమస్య రైతులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. రోజుల తరబడి కల్లాల వద్దే ధాన్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు పంటను కాపాడుకోవడం, మరోవైపు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగడం రైతులకు నిత్యకృత్యంగా మారింది.
సమీపిస్తున్న వర్షాకాలం..
వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులు తమ పంటను త్వరగా విక్రయించాలనే ఆందోళనలో ఉన్నారు. కానీ కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి కల్లాలకు తెచ్చిన తర్వాత కూడా రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. అప్పులు చేసి సాగు చేసిన రైతులు ఇప్పుడు పంట తడవకుండా కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రైతులు రోజూ ఎక్కడో ఒకచోట రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నా అధికారుల నుంచి గానీ, ప్రభుత్వ స్థాయిలో గానీ స్పష్టమైన స్పందన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదని అంటున్నారు. వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో వర్షం పడితే టార్పాలిన్లు కప్పడం, వర్షం తగ్గిన వెంటనే మళ్లీ పంటను ఆరబెట్టడం రైతులకు రోజువారీ పనిగా మారింది. అధికారులు లారీల కొరత తీర్చాలని, హమాలీల సమస్య పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కుంటాల మండలంలో..
కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం రాత్రి ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పల వద్దకు వర్షపు నీరు చేరింది. రైతులు మంగళవారం ధాన్యం నుంచి వర్షపు నీరు తొలగించి ఆరబెట్టారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే తరలించాలని రైతులు కోరుతున్నారు
బాసర:బాసర జ్ఞానసరస్వతీ దేవి ఆలయానికి ప్రతిరోజూ వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. పండుగల సెలవులు, పర్వదినాలు, శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయం సమీపంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పురాతన వేదవతి శిలను కూడా సందర్శించుకుంటారు. ఈ శిలను మరో రాయితో తాకిస్తే అమ్మవారి సప్తస్వరాలు వినిపిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంతటి ప్రత్యేకత ఉన్నప్పటికీ, ఈ ప్రదేశం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.
అభివృద్ధి కోసం భక్తుల డిమాండ్..
వేదవతి శిల పరిసరాలను పార్క్‌లా అభివృద్ధి చేయాలని భక్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు. పచ్చదనంతో చెట్లు నాటడం, విశ్రాంతి వేదికలు, తాగునీరు సౌకర్యాలు, కూర్చునేందుకు బెంచీలు, లైటింగ్, రక్షణ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి, చిన్న మొత్తంలో ప్రవేశ రుసుము వసూలు చేస్తే ఆలయానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడంతో వేదశిల పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చుట్టూ కంచె లేకపోవడంతో పశువులు, పందులు, శునకాలు శిల వరకూ వస్తున్నాయి. భక్తులు వెళ్లేందుకు సరైన దారి కూడా లేదు. ఈ నేపథ్యంలో శిలను సంరక్షించి, అభివృద్ధి చేయడంపై ఆలయ ఈవో ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
చుట్టూ కంచెలు వేసుకోవడంతో ఇరుకుగా మారిన భక్తులు వెళ్లే దారి..


