ఇందిరమ్మకు అ‘ధనం’ | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు అ‘ధనం’

May 27 2026 1:05 AM | Updated on May 27 2026 1:05 AM

● లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి వేతనం

లక్ష్మణచాంద:ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఊరట లభించింది. నిరుపేదలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా.. ఈ పథకాన్ని ఉపాధి హామీ స్కీమ్‌తో ప్రభుత్వం అనుసంధానించింది. అయితే, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారుడికి 90 రోజులపాటు అన్‌స్కిల్డ్‌ కూలీ కింద వేతనం చెల్లించాలని పంచాయతీరాజ్‌, ఆర్డీ కమిషనర్‌ డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రతీ లబ్ధిదారుకు రూ.27 వేల అదనపు ఆదాయం అందనుంది.

ప్రతీ లబ్ధిదారుకు 90 రోజుల వేతనం..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నిర్మాణం చేసుకుంటూనే జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.27 వేల వేతనం అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వం రూ.5 లక్షలతో నిర్మించి ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, తమ సొంత ఇంటి పనులు చేసుకుంటూ ఒక్క రోజుకు రూ.300 చొప్పున 90 రోజుల వేతనం పొందనున్నారు. దీంతో ఒక్క లబ్ధిదారుకు మొత్తం రూ.27 వేల అదనపు ఆదాయం లభించనుంది. ఇది ప్రభుత్వం అందించే రూ.5 లక్షలకు అదనం.

జాబ్‌కార్డు ఉన్నవారే అర్హులు..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు ఉండాలి. కార్డు ఉన్నవారికే ఉపాధి వేతనం అందుతుంది. జాబ్‌ కార్డు లేని వారు వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రెటరీ వద్ద దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు చేసి ప్రయోజనాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో ఇలా...

జిల్లాలో మొదటి విడతలో 19 మండలాలు, 400 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 7,651 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 1,352 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 5,740 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. 559 ఇళ్ల పనులు ప్రారంభం కావాల్సి ఉందని, త్వరలోనే ప్రారంభిస్తామని హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

జాబ్‌ కార్డు ఉంటే చాలు

ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డు కలిగి ఉంటే లబ్ధిదారుల ఇంటి పనులు నడిచే సమయంలో రోజుకు రూ.300 చొప్పున 90 రోజుల పని దినాలకు రూ.27 వేలు పొందవచ్చు. జాబ్‌ కార్డు లేనివారు వెంటనే పంచాయతీ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకుంటే వెంటనే జాబ్‌ కార్డు ఇచ్చి లభ్ధిపొందేలాగా చూస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, పీడీ హౌసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement