లక్ష్మణచాంద:జిల్లాలోని మిల్లులు, ధాన్యం నిల్వ కేంద్రాలకు వచ్చే వాహనాల్లో బస్తాల అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మండలంలోని తిర్పెల్లి గ్రామంలోని గోదామును మంగళవారం సందర్శించారు. ధాన్యం తెచ్చిన ట్రాక్టర్లు, అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. గోదాం నిల్వ సామార్థ్యం, ఇప్పటి వరకు నిల్వచేసిన ధాన్యం, అన్‌లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్యపై ఆరా తీసి, అవసరమైతే మరింత మంది హమాలీలను నియమించి అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సరిత తదితరులు ఉన్నారు.
పంట వ్యర్థాలకు నిప్పు
లక్ష్మణచాంద:సోన్ శివారులో సోమవారం రాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 200 ఎకరాలలో పంటల వ్యర్థాలు కాలిపోయాయి. ప్రమాదవశాత్తు మంటలు నలు దిక్కులా వ్యాపించడంతో సమీపంలోని రైతుల విద్యుత్ మోటార్ల కేబుళ్లు, సమీపంలో ఒక ట్రాన్స్‌ఫార్మర్ కేబుల్ తెగిపోయింది.


