పెంబి: మండలంలోని పలు గిరిజన గ్రామాలకు రోడ్లు, కడెం, దోత్తి వాగుపై వంతెన నిర్మాణాలు చేపట్టాడంతోపాటు అటవీ ప్రాంతాల్లోని గిరిజన గూడేలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని గిరిజనులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. మంగళవారం మండల కేంద్రంలో కళ్లకు గంతలు కట్టుకుని ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట వినూత్నరీతిలో నిరసన తెలిపారు. గిరిజనులకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరి తిరుపతి మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వాలు మారినా గిరిజనుల బతుకులు మారడం లేదని పేర్కొన్నారు. ఇందులో సీపీఐ(ఐ) మండల నాయకులు బాబురావు, నిర్మల, శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.


