ధాన్యం తరలించాలని కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలించాలని కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

లక్ష్మణచాంద:వరి ధాన్యం తరలించడంలో జాప్యం చేస్తున్నారని సోన్‌ మండలం న్యూ వెల్మల్‌ గ్రామ రైతులు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం తరలించడానికి లారీలు రావడం లేదని, దీంతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులుకాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది రైతులు కలెక్టరేట్‌ ఎదుట గంటపాటు ఆందోళన చేశారు. కలెక్టర్‌ లారీలు పంపుతామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న అడిషనల్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో లారీలు పంపుతామని హామీ ఇచ్చారు. వారం రోజులు రోజుకు మూడు లారీలు పంపుతామని తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఇందులో సర్పంచ్‌ రాచకొండ సాగర్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement