బిహారీ.. హమాలీ | - | Sakshi
Sakshi News home page

బిహారీ.. హమాలీ

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

● ఉపాధి కల్పిస్తున్న కొనుగోలు కేంద్రాలు ● సీజన్‌లో ఒక్కొక్కరికీ రూ.32 వేల వరకు ఆదాయం

లోకేశ్వరం: గ్రామాల్లో కూలీలు తగ్గిపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. దీంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర, బిహార్‌ కూలీలు వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. బీహార్‌ కూలీలు మొన్నటి వరకు వరి నాట్లు వేసే పనులు చేశారు. ఇప్పుడు వరికోతల సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లుల్లో కూలీలుగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బిహార్‌ హమాలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. వేసవిలో సొంత రాష్ట్రంలో పనులు లేక కూలీలు జిల్లాకు వస్తున్నారు. ఆ సమయంలో మన ప్రాంతంలో ధాన్యం చేతికి రావడంతో పని దొరుకుతోంది. ఏటా సీజన్‌లో 3 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒక్కోకొనుగోలు కేంద్రంలో దాదాపు 10–20 మంది హమాలీలు పని చేస్తున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో 225 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం బస్తాలు నింపి తూకం చేయడంతోపాటు లారీల్లో నింపేందుకు స్థానికంగా హమాలీలు దొరక లేదు. దీంతో చేసేదేమీ లేక కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బిహార్‌తోపాటు మహారాష్ట్రలోని నాందేడ్‌, అమరావతి ప్రాంతాల నుంచి హమాలీలను ఇక్కడికి రప్పిస్తున్నారు.

రూ.32 వేల ఆదాయం...

మహారాష్ట్ర, బిహార్‌ నుంచి వచ్చే కూలీలు కొనుగోలు కేంద్రాల వద్దే కుటుంబాలతో ఉంటారు. ఒక్క ముధోల్‌ నియోజకవర్గంలోనే ఇరత రాష్ట్రాల హమాలీ బృందాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 10–20 మంది వరకు పని చేస్తున్నారు. ధాన్యాన్ని బట్టి వీరి సంఖ్య పెరగొచ్చు. ధాన్యాన్ని సంచుల్లో నింపడం, తూకం చేయడం, తర్వాత లారీల్లోకి ఎక్కించడం వంటి పనులకు క్వింటాల్‌కు రూ.42 వరకు చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని బట్టి ఒక్కొక్కరికీ రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ఇలా సీజన్‌కు రూ.32 వేల వరకు మిగులుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement