డబ్బులు ఇస్తేనే కేంద్రాలకు లారీలు ఒక్కో బస్తాకు రూ.40 నుంచి రూ.50 వరకు నష్టం పట్టించుకోని అధికారులు, పాలకవర్గాలు
పెంబి: మండలంలోని మందపల్లి
గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కోనుగోలు కేంద్రానికి రైతులు భారీగా ధాన్యం తెచ్చారు. ఇప్పటి వరకు 5 వేల బస్తాలు తూకం వేశారు. మిల్లులకు తరలించారు. మరో 4 వేల బస్తాలు తూకం వేశారు. అయితే లారీలు రాక బస్తాలు కేంద్రంలోనే ఉన్నాయి. కేంద్రంలో మరో 25 వేల బస్తాల ధాన్యం ఉంది. కానీ తూకం వేసిన బస్తాలు తరలించిన తర్వాతనే మిగతా ధాన్యం తూకం వేస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే కమ్ముకుంటున్న మబ్బులు రైతులను భయపెడుతున్నాయి.
భైంసా: జిల్లాలో రైతుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక కేంద్రాల్లో ధాన్యం కుప్పలు రోజుల తరబడి నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పంట తడిసి నష్టపోతామని భయపడుతున్నారు. దీంతో రాత్రింబవళ్లు కేంద్రాల వద్దే కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
పాలకవర్గాల నిర్లక్ష్యం..
జిల్లాలో ఐదు మార్కెట్ కమిటీలు, పలు పీఏసీఎస్ సొసైటీలు ఉన్నప్పటికీ రైతుల సమస్యలపై స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు, పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. వేలాది క్వింటాళ్ల మొక్కజొన్న, వరి ధాన్యం కేంద్రాల్లో పేరుకుపోయింది. సకాలంలో రవాణా సదుపాయం లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. లారీ యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండగా, హమాలీ చార్జీలు కూడా పెరిగాయి. దీంతో మద్దతు ధర వచ్చినా రైతు చేతికి మిగిలేది చాలా తక్కువగా మారింది.
లారీల కొరత..
రైతులను ఈసారి లారీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ధాన్యం తరలించడానికి లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో సంచికి రూ.40 నుంచి రూ.50 వరకు అదనంగా ఇస్తేనే లారీలు వస్తున్నాయని వాపోతున్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.80 నుంచి రూ.100 వరకు రవాణా ఖర్చు పెరిగింది. ఇప్పటికే సాగు ఖర్చులు, ఎరువులు, కూలీల భారంతో నష్టాల్లో ఉన్న రైతులకు ఈ అదనపు ఖర్చులు మరింత భారంగా మారాయి.
గన్నీ సంచుల కొరత..
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత కూడా తీవ్రంగా ఉంది. సరిపడా సంచులు లభ్యం కాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల రైతులే స్వయంగా డబ్బులు పెట్టి సంచులు కొని ధాన్యాన్ని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


