తరుగు పేరిట కోతలు విధిస్తే చర్యలు మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిర్మల్‌టౌన్: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేశారు. జిల్లాల వారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చోట స్థానిక హమాలీలను నియమించుకోవాలని, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
25 నుంచి మహిళా వారోత్సవాలు..
‘‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
గడువులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
వీసీ అనంతరం కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా కొనుగోళ్లు పూర్తిచేసి, రోజువారీ లక్ష్యాలను సాధించాలని సూచించారు. మహిళా వారోత్సవాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని, ప్రతిరోజూ కార్యక్రమాలను మహిళలు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డీఎం మార్క్‌ఫెడ్ మహేశ్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, హార్టికల్చ ర్ అధికారి రమణ పాల్గొన్నారు.
వర్షాలకు ముందే కొనుగోళ్లు పూర్తి చేయాలి
నిర్మల్‌టౌన్: జిల్లాలో వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు వర్షాలకు ముందే పూర్తి చేయాలని, ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా వివిధ ఏజెన్సీల ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్ల పురోగతిని తెలుసుకున్నారు. లారీలు అందుబాటులో ఉంచడంతోపాటు, హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఏజెన్సీల లారీలతోపాటు ఇతర రవాణా సౌకర్యాలను వినియోగించి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం నిల్వ కోసం ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, రైతు వేదికలు, అవసరమైన చోట్ల ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను వినియోగిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న సుదర్శన్‌రెడ్డికి కలెక్టర్ భవేశ్ మిశ్రా పూలమొక్క అందించి స్వాగతం పలికారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అదనపు ఎస్పీ సాయికిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.


