ఉపాధిపై మరింత నిఘా | - | Sakshi
Sakshi News home page

ఉపాధిపై మరింత నిఘా

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

● అవినీతిని అరికట్టేలా కమిటీలు

లక్ష్మణచాంద: వలసలను తగ్గించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా పేద కూలీలు లబ్ధి పొందుతున్నా రు. అయితే ఇదే పథకం అక్రమార్కులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. తాజాగా మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పనులకు హాజరు అయ్యే కూలీలకు ప్రస్తుతం ముఖ గుర్తింపు హాజరు ను అమలు చేస్తుంది. అలాగే ఉదయం, పని ముగించుకుని ఇంటికి వచ్చే సమయాల్లో తప్పనిసరిగా ఫొటో ను తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దీనికి తోడు పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామాల్లో నిఘా పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 19 మండలాలు 400 గ్రామ పంచాయతీల పరిధిలో 1,74,282 జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 94,789 యాక్టివ్‌ జాబ్‌ కార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం కూలీలు 3,20,936 మంది ఉండగా, యాక్టివ్‌ కూలీలు 1,54,931 ఉన్నారు.

ఏటా తనిఖీలు..

ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ఏటా చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ పేరిట ఆయా మండలాల పరిధిలో సభలు నిర్వహించి అక్రమాలపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయినా అవినీతిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు సక్రమంగా పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామంలో నిఘా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

గ్రామ సభల ద్వారా ఏర్పాటు...

గ్రామ నిఘా కమిటీలలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సగం సభ్యులు మహిళలే ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ టీచర్‌, మహిళా సంఘం సభ్యులు, సోషల్‌ ఆడిట్‌ వ్యక్తులు, యువజన సంఘం సభ్యులు ఉండాలి. గ్రామసభ ద్వారా కనీసం ఆరు నెలల కాలానికి కమిటీని ఎన్నుకుంటారు.

కమిటీ విధులు..

ఎన్నికై న కమిటీ ఉపాధి హామీ పనులు జరిగిన వారానికి క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు జరిగిన తీరు, నాణ్యతను పరిశీలిస్తారు. కూలీల హాజరు, వేతనాల చెల్లింపులు సక్రమంగా జరిగాయా లేదా నమోదు చేయాలి. కమిటీ పర్యటించి పరిశీలించిన అంశాలను గ్రామస్థాయి సామాజిక తనిఖీ జరిగే సమయంలో అందచేయాలి. వారు తయారు చేసిన నివేదికను ప్రజాపత్రాలు పరిగణించి గ్రామ పంచాయతీలలో భద్ర పరచాలి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ప్రభుత్వం సూచించిన విధంగా జిల్లాలోని 400 గ్రామాల్లో ప్రతీ గ్రామంలో ఐదుగురు సభ్యులతో నిఘా కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మయ్య, అసిస్టెంట్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌

జిల్లా సమాచారం...

Advertisement
 
Advertisement
Advertisement