మున్సిపాలిటీకొకటి చెరువు చొప్పున అభివృద్ధి నిర్మల్‌లో ధర్మసాగర్, ఖానాపూర్‌లో బొడ్డోనికుంట, భైంసా మహదేవ్‌పూర్ చెరువు ఎంపిక కట్ట బలోపేతం, అభివృద్ధి పనులు రేపు శంకుస్థాపన చేయనున్న ఇన్‌చార్జి మంత్రి జూపల్లి
మూడు చెరువులకు
చెరువుల వారీగా నిధులు..
నిర్మల్: ప్రాచీనకాలం నుంచి నీళ్లున్న చోటనే నాగరికతలు వెల్లివిరిశాయి. నాటికాలం నుంచే నీటి గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు. కానీ.. నిర్మల్‌లో మాత్రం గొప్పగా చెప్పుకునే గొలుసుకట్టు చెరువులతోపాటు జిల్లాలోని చాలా జలాశయాలు కబ్జాలపాలై, డ్రైనేజీ నీళ్లతో నిండిపోయి మురికికూపాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి కొన్నింటినైనా కాపాడుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో మూడు చెరువులను ఎంపిక చేశారు.
మున్సిపాలిటీకో చెరువు..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఒక్కో చెరువు చొప్పున పునరుద్ధరణకు నోచుకోనున్నాయి. నిర్మల్‌లో బస్టాండ్ పక్కనగల ధర్మసాగర్, భైంసాలోని సిద్ధార్థనగర్‌లోని మహదేవ్‌పూర్ చెరువు, ఖానాపూర్‌లోని శాంతినగర్‌లోని బొడ్డోనికుంట చెరువులను అభివృద్ధి పనులకు ఎంపిక చేశారు. ధర్మసాగర్ చెరువులో కట్ట బలోపేతంతోపాటు ఎప్పటి నుంచో స్థానికులు డిమాండ్ చేస్తున్న చెరువులో కలుస్తున్న డ్రైనేజీని మళ్లించనున్నారు. గతంలో వేసిన వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేసి, రెయిలింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఖానాపూర్‌లోని బొడ్డోనికుంట, భైంసా మహదేవ్‌పూర్ చెరువుల్లో ప్రధానంగా కట్ట బలోపేతం చేయనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
మిగిలిన వాటినీ కాపాడాలని..
జిల్లాలో చాలా చెరువుల్లో ఆక్రమణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని గొలుసుకట్టు చెరువులూ కబ్జాకు గురయ్యాయి. చెరువుల అభివృద్ధి, పునరుద్ధరణకు కృషిచేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నిర్మల్‌లో నీటికష్టం అనేది తెలియదంటే కారణం ఈ గొలుసుకట్టు చెరువులే. అలాంటి వాటిని కాపాడాలని స్థానికులూ డిమాండ్ చేస్తున్నారు.
ఎంపికై న చెరువుల్లో పనులు..
జిల్లాలో ఎంపికై న మూడు చెరువుల్లో ప్రధానంగా కట్ట బలోపేతం పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 50 చెరువులకు కలిపి ఒకే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.
– అరుణ్, పబ్లిక్‌హెల్త్ డీఈఈ
భైంసా – మహదేవ్‌పూర్ చెరువు రూ.2.14 కోట్లు
ఖానాపూర్ – బొడ్డోనికుంట చెరువు రూ.1.21 కోట్లు
ధర్మసాగర్.. దశమారేనా!?
నిర్మల్ పట్టణం నడిబొడ్డున అందరికీ అందుబాటులో, బస్టాండ్ పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువు ఇది. ఎప్పుడో మినీ ట్యాంక్‌బండ్‌గా ప్రకటించారు. అప్పట్లోనే రూ.కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టారు. కానీ ఏం లాభం..! నిత్యం డ్రైనేజీ నీళ్లతో, వ్యర్థ పదార్థాలతో ఆ చెరువును నింపేస్తున్నారు. పరిసరాలూ కంపుకొడుతున్నాయి. గతంలోనూ పాలకులు ఈ చెరువును సుందరీకరిస్తామంటూ పనులు చేపట్టినా మధ్యలోనే వదిలేశారు. తాజాగా సగం కేంద్రం, సగం రాష్ట్రం నిధులతో చేపట్టే చెరువుల అభివృద్ధిలో ధర్మసాగర్ ఎంపికైంది. ఇప్పటికై నా చెరువు దశ మారాలని నిర్మల్‌వాసులు కోరుతున్నారు.
చెరిసగం నిధులతో..
చెరువుల పునరుద్ధరణకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం, రాష్ట్రం 50–50 చొప్పున నిధులు కేటాయిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చెరువులకు కలిపి ఒకే కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించారు. జిల్లాలోని మూడు చెరువుల్లోనూ ఒకే సంస్థ పనులను చేపట్టనుంది. ఈ పనుల్లో ప్రధానంగా ఆయా చెరువుల కట్టలను బలోపేతం చేయనున్నారు. పర్యాటకపరంగా ఆకట్టుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించి నిర్మల్‌లో ధర్మసాగర్ చెరువు వద్ద ఆదివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.


