సడలింపు సరే...నోటిఫికేషన్లు ఏవీ...? | - | Sakshi
Sakshi News home page

సడలింపు సరే...నోటిఫికేషన్లు ఏవీ...?

May 23 2026 12:04 AM | Updated on May 23 2026 12:04 AM

తాజాగా పదేళ్లపాటు గరిష్ట వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు వయోపరిమితి పెంపు ఉత్తర్వులపై నిరుద్యోగుల్లో మిశ్రమ స్పందన జిల్లాలో ఉద్యోగ ప్రకటనల కోసం వేలాది మంది ఎదురుచూపులు

నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నిరుద్యోగ యువతలో కొంత ఆశ కలిగించినప్పటికీ, ‘‘నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి?’’ అనే ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌–ఏ) జారీ చేసిన జీవో 86 ప్రకారం, ఈ వయోపరిమితి సడలింపు ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. కరోనా సంక్షోభం కారణంగా వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది కొత్త అవకాశం కల్పించింది. అయితే యూని ఫాం సర్వీసులు (పోలీసు, ఎకై ్సజ్‌, ఫైర్‌, అటవీ, జైళ్ల శాఖలు) వంటి శారీరక ప్రమాణాలు అవసరమైన ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదు.

నోటిఫికేషన్లు లేక నిరాశ..

వయోపరిమితి పెంపు సానుకూలం కానీ, ఖాళీల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం నిరుద్యోగులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా అనేక శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని యువత వాపోతోంది.‘‘సడలింపులు ఇస్తున్నారు కానీ ఉద్యోగ ప్రకటనలు రావడం లేదు. చదువు పూర్తి చేసి ఏళ్ల తరబడి కోచింగ్‌లు చేస్తూ వయసు పెరుగుతోంది. కుటుంబ భారం ఒకవైపు, నిరుద్యోగం మరోవైపు వెంటాడుతున్నాయి’’ అని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామీణ యువత పరిస్థితి దయనీయం..

జిల్లా కేంద్రాల్లో హాస్టళ్లు, గదులు అద్దెకు తీసుకుని కోచింగ్‌ చేస్తున్న గ్రామీణ యువకుల పరిస్థితి మ రింత దారుణంగా ఉంది. తల్లిదండ్రులపై ఆర్థిక భా రం పెరుగుతుండగా ఉద్యోగ భరోసా కనిపించడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎస్సీ వంటి కొన్ని నోటిఫికేషన్లు విడుదలైనా కోర్టు వివాదాలు, పరీక్షల వాయిదాలు, ఫలితాల ఆలస్యాలు అభ్యర్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

జాబ్‌ క్యాలెండర్‌కు డిమాండ్‌..

నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, ‘‘ప్రతి ఏడాది వయోపరిమితి పెంచడం కాకుండా, ఖాళీలను గుర్తించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తారు, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే అంశాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం త్వరలో వివిధ శాఖల్లో నియామకాలు చేపడతామని సంకేతాలు ఇస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటనలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. వయోపరిమితి సడలింపు సానుకూలం కానీ, వాస్తవ ఉద్యోగ అవకాశాలే యువతకు ప్రధానం అని అందరూ పేర్కొంటున్నారు.

నోటిఫికేషన్లు విడుదల చేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు నిర్ణయం హర్షదాయకం. వెంటనే ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలతో కూడిన వివిధ నోటిఫికేషన్లను విడుదల చేయాలి. ప్రస్తు తం నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుకోవాలని సంకల్పంతో యువత ఎదురుచూస్తున్న దశలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాల నియామకాలు చేపట్టాలి

– దాసరి గణేశ్‌, కౌట్ల–బి, సారంగపూర్‌ మండలం

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి...

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగాలు భర్తీ చే స్తామని అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదలలో తీవ్ర తాత్సారం చేస్తోంది. ఇప్పటికై నా జాబ్‌ క్యాలెండర్‌ను తక్షణమే ప్రకటించి ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలి. లేనిపక్షంలో నిరుద్యోగ యువతను కలుపుకొని ఆందోళనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. – కుమ్మరి వెంకటేశ్‌,

బీజేవైఎం రాష్ట్రకార్యవర్గ సభ్యుడు

Advertisement
 
Advertisement
Advertisement