ప్రజల మనసులో నర్సన్నబాపు | - | Sakshi
Sakshi News home page

ప్రజల మనసులో నర్సన్నబాపు

May 23 2026 12:04 AM | Updated on May 23 2026 12:04 AM

నిర్మల్‌ ప్రాంత అభివృద్ధి ప్రదాత ప్రాజెక్టులు, కాలేజీలు తన హయాంలోనే.. రేపు జిల్లాకేంద్రంలో విగ్రహావిష్కరణ

నిర్మల్‌: ‘ఎంతోమంది నేతలను చూసిన. కానీ.. ప్రజల చేత బాపు అని పిలిపించుకున్న నర్సన్నబాపు వంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు..’ అని పొద్దుటూరి నర్సారెడ్డికి సంతాపం తెలుపుతున్న సందర్భంలో సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్ర సరిహద్దు మండలంలోని మారుమూల గ్రామం మలక్‌చించోలి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఎదిగిన ప్రజాప్రతినిధి. నిర్మల్‌ ప్రాంతంలో ప్రాజెక్టులు, పరిశ్రమలు, కాలేజీలు కట్టిన అభివృద్ధి ప్రదాతగా ఇప్పటికీ ప్రజల్లో నిలిచి ఉన్న రాజకీయ దిగ్గజం. అలాంటి నర్సన్నబాపు ఇన్నేళ్లకు జిల్లాకేంద్రంలో విగ్రహ ఏర్పాటుకు నోచుకుంటున్నారు.

మారుమూల నుంచి..

సారంగపూర్‌ మండలం మలక్‌చించోలికి చెందిన నర్సారెడ్డి(నర్సన్నబాపు) కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులు, హోదాల్లో పనిచేశారు. 1971 నుంచి 1972 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. 1978 ఎ న్నికల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటిపారుదల శా ఖ, రెవెన్యూశాఖ, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రిగా పనిచేశారు. వరుసగా 1967 నుంచి 1982వరకు మూడు పర్యాయాలు గెలిచి ‘హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే’గా పనిచేశారు. 1991 లో ఆదిలాబాద్‌ ఎంపీగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగానూ పనిచేశారు.

ముందుచూపున్న అభివృద్ధి ప్రదాత..

జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు స్వర్ణ, దోనిగాం ప్రాజెక్టులను నిర్మింపజేసిన ఘనత నర్సన్నబాపుదే. నిర్మల్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నటరాజ్‌ స్పిన్నింగ్‌ మిల్‌, ఉట్నూర్‌లో ఐటీడీఏ ఏర్పాటు నర్సన్నబాపు హయాంలో తీసుకువచ్చినవే. ఈ ఏడాది జనవరి 16న నిర్మల్‌లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి స్వర్ణ ప్రాజెక్టుకు నర్సన్నబాపు పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.

రాజకీయ వారసత్వం లేకుండా..

ప్రస్తుత రాజకీయాల్లో సర్పంచ్‌, కౌన్సిలర్‌లే తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. కానీ నర్సారెడ్డి కుటుంబం నుంచి రాజకీయ వారసులు లేకపోవడం గమనార్హం. ఆయన ముగ్గురు కుమారులు, కుమార్తె రాజకీయాలవైపు రాలేదు. నర్సారెడ్డి తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా, నిబంధనల కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ, విజ్ఞాపనల కమిటీ, సంప్రదింపుల కమిటీల సభ్యుడిగానూ పనిచేశారు. వయసు పైబడటంతో 2024 జనవరి 29న నర్సన్నబాపు కన్నుమూశారు. స్థానిక బస్టాండ్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన నర్సన్నబాపు విగ్రహాన్ని ఈ నెల 24న ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement