నిర్మల్‌టౌన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు మెరుగ్గా అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామీణ, నియోజకవర్గ స్థాయిలలో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, విద్య, వైద్యం, అరైవ్ అలైవ్’, రైతు వారోత్సవాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి, అంకం మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


