నిధులు విడుదల చేసిన సర్కారు
లక్ష్మణచాంద: గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కాస్మొటిక్, డైట్ చార్జీల చెల్లింపునకు ఇక నుంచి నెలనెలా నిధులు విడుదల చేయనుంది. రెండ్రోజుల క్రితం డిప్యూ టీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తొలి త్రైమాసికానికి సంబంధించి గురుకులాల విద్యార్థుల డైట్, కాస్మొటిక్, అద్దె భవనాల అద్దె చెల్లించేందుకు గాను రూ.221.24 కోట్లు విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 10వేల మందికి పైగా విద్యార్థులకు మేలు జరగనుంది. అయితే, గతంలో సకాలంలో నిధులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, కళాశాలల అద్దె డబ్బులు నెలల తరబడి చెల్లించలేక ప్రిన్సిపాల్‌లు ఇబ్బందులకు గురయ్యారు. సకాలంలో విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలు, పాఠశాలలు, కళాశాలల అద్దె డబ్బులు ప్రతినెలా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు, పోషకులు హర్షం వ్యక్తంజేస్తున్నారు.
జిల్లాలో ఇలా..
ఎస్సీ సంక్షేమశాఖకు సంబంధించిన ఐదు పాఠశాలలు, ఒక డిగ్రీ కళాశాల ఉంది. ఇందులో దాదాపు 2వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో రెండు అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు డీసీవో ప్రశాంతి తెలిపారు. మైనార్టీ గురుకులాలు పాఠశాలలు, కళాశాలలు ఐదు ఉండగా నిర్మల్‌లో మాత్రమే బాలికలు, బాలురకు సంబంధించి సొంత భవనముంది. ఖానాపూర్, భైంసా, ముధోల్‌లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో 2వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు, నాలుగు కళాశాలలున్నాయి. ఇందులో దాదాపు 2,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక టీఎస్‌ఆర్‌జేసీ పాఠశాల, కళాశాల ఉండగా దీనికి సొంత భవనముంది. ఒక ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ఉంది.
విద్యార్థులకు మేలు చేసే నిర్ణయం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క ఇటీవల రూ.221.24 కోట్ల నిధులు విడుదల చేయడంతో నెలనెలా కాస్మొటిక్, డైట్ చార్జీలు చెల్లించే అవకాశముంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి ప్రతినెలా అద్దె చెల్లించొచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో గురుకులాల విద్యార్థులకు మేలు జరుగుతుంది.
– ఆర్.ప్రశాంతి, డీసీవో


