ముధోల్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పేద గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా విశాలమైన స్థలం, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మూడు పాఠశాలలను ఎంపిక చేశారు. ముధోల్ నియోజకవర్గంలోని కుంటాల మోడల్ స్కూల్, నిర్మల్‌లోని నర్సాపూర్(జి) ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖానా పూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ జెడ్పీఎస్‌ఎస్ ఎంపికయ్యాయి. వీటిలో ఎల్‌కేజీ, యూకేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్ తరగతులు నిర్వహించనున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తారని, విద్యార్థులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. వీటిలో డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉండనుంది.
ఒక్కో టీపీఎస్‌కు రూ.38కోట్లు..!
ఒక టీపీఎస్ ఏర్పాటుకు సుమారు రూ.38కోట్ల అంచనా వ్యయంతో భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 40వేల లీటర్ల సంప్, డైనింగ్ హాల్, మూడంతస్తులతో స్కూల్ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, ఫర్నిచర్, ల్యాబ్, ఇండోర్ స్పోర్ట్స్, ప్రొవైడింగ్ అప్రోచ్ రోడ్, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ తదితర నిర్మాణాలు చేపడతారు. వచ్చే సంవత్సరం నుంచి ఈ పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


