నిర్మల్‌టౌన్: ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, దేశ రాజకీయాల్లో యువత పాత్ర కీలకమని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక‘లో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక శిక్షణ కేంద్రం (ఐటీఐ) లో బుధవారం ‘యూత్ లీడర్ షిప్ సమ్మిట్’ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. యువజన, క్రీడ ల శాఖ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మి, ఐటీఐ కన్వీనర్ కోటిరెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


