30 నిమిషాల్లో ఎఫ్‌ఐఆర్
● బాధితుడి ఇంటికి వెళ్లిన పోలీసులు
భైంసారూరల్: ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ప్రజలకు అతి సులభమైన మార్గంలో భరోసా కల్పిస్తూ, స్టేషన్‌కురాలేని బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. 30 నిమిషాల్లోనే ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రజల వద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. భైంసారూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్జూర్ గ్రామానికి చెందిన కళ్యాణ్ బయ్యాజి(70) వృద్ధాప్యం కారణంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై సుప్రియ తన సిబ్బందితో కలిసి బిజ్జూర్ గ్రామానికి చేరుకున్నారు. బాధితుడి ఇంటి వద్దనే ఫిర్యాదు స్వీకరించారు. శుక్రవారం రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో కట్టేసి ఉంచిన ఆవును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు కళ్యాణ్ బయ్యాజి తెలిపారు. శనివారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 30 నిమిషాల్లో ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్‌కు రాలేని బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు 30 నిమిషాల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని భరోసా కల్పించారు.


