మూడు బల్దియాల్లో ఐదు నామినేషన్లు
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభమైంది. పట్టణంలోని 12వార్డులకు గాను ఆరు కౌంటర్ల ద్వారా కమిషనర్ సుందర్‌సింగ్, తహసీల్దార్ సుజాత పర్యవేక్షణలో నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌కు చెందిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్య, బీజేపీ నాయకురాలు అంకం మౌనిక మహేందర్, బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యుడు బండారి కిశోర్ నామినేషన్ వేసినవారిలో ఉన్నారు. మరో 50 మంది అభ్యర్థులు హెల్ప్ డెస్క్ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకువెళ్లారు.
భైంసాలో రెండు..
భైంసాటౌన్: భైంసా మున్సిపాలిటీలో 26వార్డులుండగా, నామినేషన్ల స్వీకరణకు వార్డులవారీగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటిరోజు రెండు నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అజ్మీరా సంకేత్‌కుమార్ తెలిపారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా నేతృత్వంలో పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బల్దియాకు పన్నుల రూపంలో రూ.7.40 లక్షల ఆదాయం సమకూరింది.


