‘ఖానాపూర్‌లో కుంటుపడిన అభివృద్ధి’
ఖానాపూర్: పదేళ్ల బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఖానాపూర్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఖానాపూర్ మున్సిపల్‌గా ఏర్పడ్డా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఖానాపూర్ మున్సిపల్ పీఠమే లక్ష్యంగా అన్ని వార్డుల్లో కాషాయజెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కరిపె రంజిత్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన పలువురికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, నల్ల రవీందర్‌రెడ్డి, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, ఎనగందుల నారాయణ, తిరుమల్, రాజ్‌కుమార్, పవన్, మురళి తదితరులు పాల్గొన్నారు.


