అన్నదాతకు అండగా..
నిర్మల్‌చైన్‌గేట్: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి 4,454 యూనిట్లు మంజూరు కాగా, ప్రభుత్వం రూ.3.35 కోట్లు కేటాయించింది.
సబ్సిడీ వివరాలు
వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయ సబ్సిడీలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు పరికర ధరలో 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. రైతు ఎంపిక చేసుకున్న కంపెనీ ధరలో సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రైతు డీడీ రూపంలో దరఖాస్తతో కలిపి సమర్పించాలి.
పెరిగిన సాగు ఖర్చులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యాంత్రీకరణవైపు మళ్లినప్పటికీ, గత ప్రభుత్వ కాలంలో పథకం ఆగిపోయింది. దీంతో రైతులు సొంత ఖర్చుతో పనిముట్లు కొనుగోలు చేసుకుంటున్నారు. పరికరాల ధరలు ఎక్కువగా పెరగడంతో ఇది భారంగా మారింది. వరి సాగులో ఆధునిక పరికరాలు వచ్చినా, వాటి ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి.
ఎన్నికల కోడ్‌తో ఆలస్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం యాంత్రీకరణ పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో రూపొందిన ఈ పథకానికి రూ.3.35 కోట్లు విడుదలయ్యాయి. తొమ్మిది నెలల క్రితం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల ఎంపిక పూర్తి చేశారు. సెప్టెంబర్ 17లోగా పరికరాలు అందించాల్సి ఉన్నా, పంచాయతీ ఎన్నికల కోడ్ వల్ల ప్రక్రియ ఆగిపోయింది. త్వరలోనే పూర్తి అమలు జరుగనుంది.
చిన్న రైతులకు ప్రయోజనం..
గతంలో పెద్ద ట్రాక్టర్లు పంపిణీ చేసినప్పుడు అవి పెద్ద రైతులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇప్పుడు చిన్న, సన్నకారు రైతులకు సరిపడేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. హార్వెస్టర్లు, పవర్ టిల్లర్లు, ఎంబీ నాగాలు, తైవాన్ స్ప్రేయర్లు, గడ్డి బేలర్ యంత్రాలు, రొటేవేటర్లు వంటి చిన్న పరికరాలు అందిస్తారు. జిల్లాకు 4,454 యూనిట్లు మంజూరయ్యాయి.
మంజూరైన పరికరాలు..
పరికరం యూనిట్లు నిధులు రూ.లక్షల్లో
బ్యాటరీ ఆపరేటర్‌మ్యానువల్ 3,228 32.28
పవర్ స్ప్రేయర్ 525 5.25
రోటవేటర్ 239 11.9
పవర్ వీడర్ 50 1.75
సీడ్ అండ్ ఫర్టిలైజర్ 50 1.50
కల్టివేటర్, అదర్స్ 290 58
గట్లు వేసే మిషన్(పీవోటీ కానివి) 6 0.90
బ్రష్ కట్టర్ 41 14
పవర్ టిల్లర్ 25 25


