వేడెక్కిన ‘పుర’ రాజకీయం
నిర్మల్/నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే, పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందే పట్టణాల్లో రాజకీయాలు వేడెకుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ఓవైపు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు సైతం మెజారిటీ స్థానాలు కై వసం చేసుకోవడం కోసం ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఆశావహుల సందడి నెలకొంది.
ముందస్తు ప్రచారం..
ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ వెలువడకముందే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కనిపించని వారు ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
పలకరిస్తూ.. పనులు చేస్తూ..
నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్నవారంతా జనం బాట పట్టారు. ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రెయినేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు విద్యుత్ దీపాలు, పైపులైన్ల మరమ్మతులు చేయించడంపై దృష్టి సారించారు.
ప్లాన్–బి సిద్ధం...
రిజర్వేషన్ కలిసి వచ్చినప్పటికీ టికెట్ రాకుంటే ఏం చేయాలా అన్న దానికి ప్లాన్–బీతో రెడీగా ఉన్నారు. వార్డులో ఇతర ఆశావహునికి తాము కోరుకున్న పార్టీ టికెట్ వస్తే ఇండిపెండెంట్‌గానైనా, కండువా మార్చుకుని అయినా బరిలో దిగాలన్న ఆలోచనతో ముందుస్తుగానే ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా రంగంలోకి దిగేందుకు అవసరమైన అంగబలం, అర్ధబలం సిద్ధం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో సిద్ధంగా ఉన్నారు.


