ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం అలసత్వం
ఖానాపూర్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ విమర్శించారు. ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారందరికీ తనవంతు సాయంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చి డ్రైవర్ల వివరాలు సేకరించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు బీమా ప్రీమియం చెల్లిస్తానని ప్రకటించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతోందని విమర్శించారు. రూ.5 లక్షల బీమా రద్దు చేసి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో అసంఘటితరంగ కార్మికులకు రైతుబీమా తరహాలో రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.1,000 చొప్పున (సంవత్సరానికి రూ.12,000) సహాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ రెండేళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదన్నారు. ప్రతీ ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24 వేల బాకీ ఉందని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల మందికిపైగా ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారికి ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో వ్యక్తిగతంగా తానే బీమా ప్రీమియం చెల్లిస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, రాజగంగన్న, శ్రీనివాస్, ప్రదీప్, కేహెచ్.ఖాన్, షోయబ్, సుమిత్, రాకేశ్, చంద్రహాస్, వాల్‌సింగ్, వాహబ్, రాజు, డ్రైవర్లు పాల్గొన్నారు.


